పార్టీని వీడిన వారిని తిరిగి చేర్చుకునేదిలే
వచ్చే ఎన్నికలలో కొత్తవారికి ప్రాధాన్యం
కాంగ్రెస్ పాలనలో ఇబ్బంది పడుతున్న ప్రజలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి
వరంగల్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై సమీక్ష
మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ నేతలు హాజరు
వరంగల్ సమర శంఖంతోనే ఇక దూకుడు
ప్రజల మధ్యలో ఉంటూనే కాంగ్రెస్ సర్కార్ పై పోరు
ఎర్రవెల్లి , ఆంధ్రప్రభ : రాబోయే ఎన్నికలలో ఎక్కువ మందికి స్థానం కల్పిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఆయారాం గయారాం నేతలు మనకొద్దని తేల్చి చెప్పారు.. పార్టీ వీడిన వారిని తిరిగి చేర్చుకునే ప్రసక్తి లేదన్నారు.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శనివారం ఎర్రవెల్లి నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
బీజేపీ, కాంగ్రెస్ మనకు పోటీనే కాదు
ఈ సందర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పలు సీట్లకు ఉప ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్ గెలుపొందడం ఖాయమన్నారు. అలాగే.. మనకు బీజేపీ, కాంగ్రెస్ ఎవరూ పోటీ కాదన్నారు. కాంగ్రెస్ పాలనను అనుభవిస్తున్న ప్రజలు పదేళ్లవరకు మళ్లీ దానికి ఓట్లు కూడా వేయరన్నారు. వ్యవసాయం, నీరు, కరెంటు తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే ప్రజలు ఎన్నికల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని.. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా.. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పీడ పోతుందా అని చూస్తున్నారని అన్నారు. మళ్లీ వారు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. విపక్షం లో ఉన్నప్పడు ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలని, ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు మేలు జరిగేలా చూడాలని హితవు పలికారు. వరంగల్ సభతో శంఖం పూరించి వచ్చే ఎన్నికలకు సంసిద్ధం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.

వరుస సమావేశాలతో కేసీఆర్ బిజీ
కాగా, ఈ సమావేశంలో వరంగల్‌లో నిర్వహించే పార్టీ రజతోత్సవ మహాసభ గురించి ఈ జిల్లాలల నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో రోజుకు రెండు ఉమ్మడి జిల్లాల నేతలతో కేసీఆర్ సన్నాహక సమావేశాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వరుస సమావేశాల్లో కేసీఆర్ పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక సూచనలు చేస్తున్నారు. ఉద్యమ పంథాను గుర్తు చేస్తున్న ఆయన కాంగ్రెస్ పార్టీ వైఫల్యా లపై ప్రజల్లోకి వెళ్లేలా దిశానిర్దేశం చేస్తూ వరం గల్ సభ విజయవంతానికి కార్యోన్ముఖులను చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలు అనునిత్యం ప్రజాక్షేత్రంలో అందుబాటు-లో ఉండాలని ఉప దేశమిచ్చిన కేసీఆర్ అప్పుడే పార్టీపై సాను కూలత పెరుగు తుందని నేతలకు చెప్పారు. ఇక పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమా ల్లో పాల్గొని విజయవంతం చేసిన నేతలకు భవిష్యత్ ఉంటుందని అన్నారు.

ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు సిహెచ్. లక్ష్మారెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, వీ. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఆల్. వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ నేతలు డా. ఆంజనేయ గౌడ్, హనుమంతు నాయుడు, గట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, బానోత్ మదన్ లాల్, బానోత్ హరిప్రియ నాయక్, రేగ కాంతారావు, మెచ్చా నాగేశ్వర్ రావు, వనం వెంకటేశ్వర రావు, లింగాల కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి. జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్ర కుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, బొల్లం మల్లయ్య యాదవ్, బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ సీనియర్ నేత విజయసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆశన్నగారి, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, పార్టీ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

