సీఎం రేవంత్ రెడ్డి
ఎస్‌జీడీ ఫార్మా రెండో యూనిట్‌ను ప్రారంభించిన సీఎం
వెబ్ న్యూస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ (BRS) కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని, విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చాక పంపకాల్లో ఒకరినొకరు సహించుకోలేక పోతున్నారని, మీ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ రోజు మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar District) మూసాపేట మండలం వేములలో ఎస్‌జీడీ ఫార్మా (SGD Pharma) రెండో యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హరీశ్ రావు (Harish Rao), సంతోష్ రావు (Santosh Rao) వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని కవిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక తానెందుకు ఉంటాను? తనకు అంత సమయంలేదన్నారు. మీరు చేసిన పాపం ఊరికే పోదని అనుభవించక తప్పదన్నారు.
పాలమూరు జిల్లా (Palamuru district)లో కృష్ణా జలాలు (Krishna waters) పక్క నుంచే వెళ్తున్నా తాగు, సాగునీటి కోసం జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కొంత నిధుల కొరత ఉందని అన్నారు. అయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి ఏది వచ్చినా మొదటి ముద్ద పాలమూరు జిల్లాకేనని సీఎం చెప్పారు. జిల్లాల్లో విద్య కోసం అవసరమైన వసతులు కల్పించేందుకు నిధులు అందించడంలో మనకు దరిద్రం లేదన్నారు. ఇటీవల పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ప్రాజెక్టు (Kodangal-Narayanpet lift project)ను తొక్కిపెట్టి మా ప్రాంతానికి అన్యాయం చేశారు. తామొచ్చాక రూ. 4000 కోట్ల తో టెండర్లు పిలిచి ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ముందుకు వెళ్లాలని చూస్తుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యుునల్ (National Green Tribunal)లో కేసులు వేసి అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు.
ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు ప్రజలకు వివరించాలని మీడియాకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఏ నియోజకవర్గంలో ఏటీసీలు లేవో వెంటనే ప్రతిపాదనలు పంపించాలన్నారు.