హైదరాబాద్ – కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్. మంటికైనా ఇంటోడే కావాలని ఊరికే అనలేదన్నారు. ఈ కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యమని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఆకాంక్షలు ఈ పార్టీలకు పట్టవని అన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు.
రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు కావాలని అడగరని..ఉన్న పరిశ్రమలను ఉంచాలని కోరరని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరని, ఆదిలాబాద్‌లో సీసీఐ ఫ్యాక్టరీ వేలానికి పెడ్తతారని చురకలంటించారు. బీజేపీ నుండి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా అటు పార్లమెంట్ లోనూ, అసెంబ్లీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ నోరు తెరిచి దీని గురించి మాట్లాడరని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది ఎంపీలు, 64 మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ ఈ అన్యాయాన్ని ప్రశ్నించరని కేటీఆర్ నిలదీశారు.
శనివారం చెన్నైకు కేటీఆర్..
కాగా కేటీఆర్ శనివారం చెన్నై పర్యటనకు వెళ్లనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగే దక్షిణాది రాష్ట్రాల నాయకుల సమావేశానికి ఆయన హాజరవుతున్నారు. కేటీఆర్‌తో పాటు చెన్నైకు మాజీ ఎంపీ వినోద్, బీఆర్ఎస్ ఎంపీలు వెళుతున్నారు.