పోటాపోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారం..

పోటాపోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారం..

హైద‌రాబాద్, (ఆంధ్ర‌ప్ర‌భ‌): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్ర‌చారంలో భాగంగా శుక్ర‌వారం సోమాజిగూడ డివిజ‌న్ (Somajiguda division) ప‌రిధిలో అధికార‌, విప‌క్ష పార్టీల అభ్య‌ర్థుల త‌ర‌పున ఆయా పార్టీల కార్య‌కర్త‌లు విస్ర్తృత ప్ర‌చారం నిర్వ‌హించారు. ఎల్లారెడ్డిగూడ‌లోని ఇమామ్ గూడ హుస్సేనీ మ‌సీద్ తో పాటు ఇత‌ర ప్రాంతాల్లోని మ‌సీదులు, ద‌ర్గాల ఎదుట త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని ప్ర‌చార ప‌త్రాల‌ను పంపిణీ చేశారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్, బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత గోపినాథ్ ల‌కు మ‌ద్ధ‌తుగా ఇరు పార్టీల‌కు చెందిన ప‌లువురు నాయకులు మసీదులు, ద‌ర్గాల ఎదుట ప్ర‌చారంతో సంద‌డి చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) పై ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ఫోక‌స్ పెట్టాయి. ఈ నేప‌థ్యంలో దేవాల‌యాలు, మ‌సీదులు, ప్రార్థ‌నామందిరాల స‌మీపంలో త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని ప్ర‌చారాలు చేస్తున్నారు. ఈ ప్ర‌చారంలో స్థానిక నాయ‌కుల‌తో పాటు గ్రేట‌ర్ ప‌రిధిలోని నాయ‌కులు, ఇత‌ర జిల్లాల నుంచి వచ్చిన కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చి ప్ర‌చారం చేస్తున్నారు.

ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో టీపీసీసీ కార్య‌ద‌ర్శి దేవేంద‌ర్ రెడ్డి, నాగేష్‌(చాంద్రాయ‌గుట్ట‌), దినేష్ (ఎన్ఎస్‌యూఐ), సురేంద‌ర్ రెడ్డి (మాజీ డీసీఎంఎస్ ఛైర్మ‌న్‌, నాగ‌రాజు (యూత్ కాంగ్రెస్‌), బీఆర్ఎస్ త‌ర‌ఫున సోమాజిగూడ ఇన్ ఛార్జి జాకీర్ హుస్సేన్‌, జ‌మీల్ బాయ్‌ (క‌రీంన‌గ‌ర్‌), జ‌హీర్‌ (మాజీ డివిజ‌న్ ప్రెసిడెంట్‌), స‌య్య‌ద్ ల‌తీఫ్ బాయి (డివిజ‌న్ ప్రెసిడెంట్‌), మ‌హ‌మ్మ‌ద్ న‌జీరుద్దీన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply