విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ముఖ్య నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ పి.మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు.
ఈ కేసులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఏ4 నిందితుడిగా చేర్చారు. విజయవాడలోని సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డ ఈరోజు ఉదయం విచారణకు హాజరవ్వగా.. ఆయనను దాదాపు ఆరు గంటల పాటు సిట్ అధికారులు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు.
కేసు వివరాలు
2019-2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రూ. 3,200 కోట్ల నుంచి రూ. 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ కనుగొంది. మద్యం విధానంలో మార్పులు చేయడం, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, హవాలా లావాదేవీలలో ఆయన ప్రమేయం ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 12 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మిథున్ రెడ్డి అరెస్టు ఈ కేసులో ఒక ముఖ్యమైన పరిణామంగా పరిగణిస్తున్నారు.
తొలి తొలి ఛార్జిషీట్ దాఖలు
ఎపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంలో సీఐడీ సిట్ అధికారులు ఇవాళ తొలి ఛార్జిషీట్ దాఖలు చేశారు. మద్యం స్కాం ఎలా జరిగింది ? నిందితులు ఎవరు ? సాక్షులెవరు ? ఇతర వివరాలతో మొత్తం 300 పేజీల అభియోగపత్రాన్ని కోర్టులో ఇవాళ దాఖలు చేశారు.
వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న మద్యం స్కాం విలువ రూ.3500 కోట్లుగా అధికార కూటమి ఆరోపిస్తున్న నేపథ్యంలో 62 కోట్ల మొత్తాన్ని ఇప్పటివరకూ సీజ్ చేసినట్లు ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. 100కు పైగా ఫోరెన్సిక్ నివేదికలు ఇందులో పొందుపర్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో 268 మంది సాక్ష్యుల్ని విచారించినట్లు సీఐడీ సిట్ తెలిపింది. అలాగే ఈ కేసులో డబ్బు ఎవరెవరి నుంచి చేతులు మారిందనే అంశాల్ని ప్రాధమికంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. మరో 20 రోజుల్లో రెండో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని కోర్టుకు చెప్పినట్లు తెలుస్తోంది.