5న కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు బ్రేక్

‎బాపట్ల బ్యూరో (ఆంధ్రప్రభ) : ‎బాపట్ల సూర్యలంక సముద్రతీరంలో పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఆదేశాలు మరికొంత కాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 5వ తేదీన జరిగే కార్తీక పౌర్ణమికి తొలుత ఏర్పాట్లు చేసిన అధికారులు తాజాగా వాటిని నిలిపి వేశారు. తుఫాను ప్రభావంతో సముద్ర గర్భంలో ఏర్పడిన గుంతల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కార్తీకమాసం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలను పర్యాటకుల రాకను తాత్కాలికంగా నిషేధించినట్లు అధికారులు ప్రకటించారు.



‎జిల్లాలోని 5 బీచ్లకు తాత్కాలికంగా పర్యాటకుల రాక నిషేధించినట్లు అధికారులు ప్రకటించారు ప్రధానంగా బాపట్ల సూర్యలంక బీచ్ పాండురంగాపురం బీచ్ గోల్డెన్ సాండ్ బీచ్ వాడరేవు బీచ్ రామాపురం బీచ్ లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆదివారం సాయంత్రం అధికారులు ప్రకటించారు. ఆదివారం ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన పర్యాటకులను పోలీసులు తిప్పి పంపారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసానికి లక్షలాదిమంది పర్యాటక జనం భక్తులు సూర్యలంక తీరానికి విచ్చేస్తుంటారు.

ఈ మాసం మొత్తం మీద ఐదు నుండి 8 లక్షల మంది వరకు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఈ ఏడాది మొందా తుఫాను ప్రభావంతో సూర్యలంక తీరానికి సెలవు ప్రకటించారు. సరిగ్గా కార్తీకమాసం ప్రారంభమయ్యే సమయానికి ఈ తీరానికి ప్రవేశాన్ని నిషేధించారు. కార్తీక మాసం తొలి సోమవారం నుండే సముద్ర తీరానికి పర్యాటకులు ఎవరు వెళ్లకుండా పోలీసులు అదేశాలు జారీ చేశారు. తొలి సోమవారం కాస్త అలా తుఫాన్ లో ముగిసిపోయింది.

తాజాగా ఈనెల మూడవ తేదీన కార్తీక రెండో సోమవారం వచ్చేసింది. ఈనెల 5వ తేదీన పవిత్ర కార్తీక పౌర్ణమి, సముద్ర హారతి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే సముద్ర తీరం సెలవులో ఉండటంతో, పౌర్ణమి సంబరాలు ఆశించిన స్థాయిలో జరక్కపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇదే సందర్భంలో నిషేధాన్ని మరికొంతకాలం పొడిగిస్తూ అధికారులు జారీ చేయడంతో ఈసారి కార్తీక మాసానికి సముద్ర తీర ప్రవేశం లేనట్లే కనిపిస్తోంది.

పౌర్ణమికి సంబంధించి ఆదివారం సూర్యలంక తీరంలో అనేక ఏర్పాట్లు చేస్తూ వచ్చిన అధికారులు అధికారుల ఆదేశాలతో వాటిని నిలిపివేశారు. మహిళలు దుస్తులు మార్చుకునే వసతులు ఏర్పాటుచేస్తున్నారు. గత నెల 27వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు సాగర సంబరాలకు వస్తారని అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ పర్యటన రద్దు కావడంతో సముద్ర తీరంలో ఉన్న జల్లు స్నాన సౌకర్యాన్ని తొలగించారు. ఇప్పుడు మళ్లీ దాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.

మరో 48 గంటల్లో ఇవన్నీ పూర్తఅవుతాయా అనేది కొంత అనుమానమే. ఇదే సందర్భంలో తుఫాను ప్రభావంతో సముద్ర తీరంలో ఇసుక కోసుకుపోయింది. పర్యాటకులు భక్తుల కోసం వాహనాల నిలుపుదలకు కేటాయించిన స్థలాలు వర్షం నీటిలో ఉన్నాయి. గత సంవత్సరం లక్ష మంది వరకు పౌర్ణమి స్నానాలు ఆచరించారు. అప్పట్లో పార్కింగ్ స్థలాలు సరిపోక పోవటంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ ఏడాది వర్షం నీటిలో ఉన్న పార్కింగ్ స్థలాల్లో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొని ఉంది.

అన్నింటికంటే మించి సముద్రంలో పవిత్ర స్నానాలు చేసే అవకాశం లేకుండా పోయింది. తుఫాను సృష్టించిన బీభత్సంతో సముద్ర తీరం మొత్తం కోసుకుపోయింది. అంతే స్థాయిలో సముద్ర గర్భంలో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని గుర్తించారు. కార్తీక పౌర్ణమి స్నానాలకు అనుమతి ఇవ్వాలా వద్ద అనే విషయాన్ని పరిశీలించేందుకు ఆర్డీవో గ్లోరియా సముద్ర తీరానికి విచ్చేశారు. ఇదే సందర్భంగా సముద్ర తీరంలో బోట్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు.

తాజా పరిస్థితులు సముద్రంలో ఏ మాత్రం అనుకూలంగా లేవని నిర్ధారించారు. వేలాది మంది పుణ్య స్నానాలు చేసే సమయంలో ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి మళ్లీ అధికారులు ఆదేశించే వరకు సముద్రానికి ప్రవేశం లేదని అన్నారు. బాపట్ల డిఎస్పి రామాంజనేయులు ఈ విషయమై మాట్లాడుతూ సముద్రతీర ప్రవేశానికి కొనసాగుతున్న నిషేధం పొడిగించడం జరిగిందని తెలిపారు. మళ్లీ ఆదేశించే వరకు అనుమతి లేదన్నారు.

Leave a Reply