మహబూబ్నగర్ జిల్లా, చిన్న చింతకుంట మండలం, అమ్మాపురం గ్రామంలోని కురుమూర్తి గిరులందు స్వయంభువుగా వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం రోజున శ్రీనివాసుడి కల్యాణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడుకొండల వెంకన్నకు ప్రతిరూపంగా, తెలంగాణ తిరుపతిగా, ఉమ్మడి పాలమూరు పల్లె ప్రజల ఆరాధ్య దైవంగా ఈ స్వామివారు ప్రసిద్ధి చెందారు.
ఉత్సవాల్లో భాగంగా, రాత్రి 8 గంటలకు శ్రీ కురుమూర్తి శ్రీనివాసుడు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉత్సవమూర్తులై మయూర వాహనంపై ఊరేగారు. శోభాయమానంగా అలంకరించిన పూలమాలల మధ్య, మేళతాళాలు, భక్తుల గోవింద నామస్మరణలతో ప్రధాన ఆలయ కాంచన గుహ నుండి మొదటి ద్వారం వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా సాగింది.
ఈ మయూర వాహన సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, పాలకమండలి అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

