రోడ్డు ప్రమాదంలో బీఎన్ సీడ్స్ యజమాని మృతి

- కుటుంబంలో విషాదం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక బీఎన్ సీడ్స్ యజమాని, పీపల్ పాడ్ గ్రామానికి చెందిన బొమ్మిడి నర్సిరెడ్డి (72) అక్కడికక్కడే మృతి చెందారు.
స్కూటీపై మండల తహసీల్దార్ కార్యాలయం వైపు నుంచి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందుకు వచ్చిన నర్సిరెడ్డి, బస్టాండ్‌లోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ టైరు స్కూటీపైకి ఎక్కడంతో ఆయన కాళ్లు విరిగి తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.
మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు రామ్మోహన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యాదగిరి తెలిపారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
