blood donation | మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం..

blood donation | అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ నియోజకవర్గంలో అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా చల్లపల్లికి చెందిన కస్తూరి విజయ్ కుమార్ మరోసారి ప్రశంసలు అందుకున్నారు. ఆయన తాజాగా 77వ సారి రక్తదానం చేసి మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు. మచిలీపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతికి అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో సమాచారం అందగానే ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు. సమయానికి అందిన రక్తంతో యువతి ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు.

చల్లపల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్ గత కొన్నేళ్లుగా నిరంతరంగా రక్తదానం చేస్తూ అనేకమంది ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఇంత అధిక సంఖ్యలో రక్తదానాలు చేసిన వ్యక్తి మరెవరూ లేరని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు కస్తూరి విజయ్ కుమార్ సేవలను కొనియాడుతూ, యువత ఇలాంటి సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

Leave a Reply