అయిదు రాష్ట్రాల ఎన్నికల కోసం సరికొత్త వ్యూహం
తొలిసారి కషాయ అధిపతిగా మహిళలకు అవకాశం
ఇప్పటికే పచ్చజెండా ఊపిన ఆర్ఎస్ఎస్
రేసులో అగ్రభాగాన నిర్మలా, పురందేశ్వరి, వానతి
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : 1980, ఏప్రిల్ ఆరో తేదీన ఆవిర్భావించిన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం.. పురుషుల సారథ్యంలోనే కొనసాగుతోంది. 45 ఏండ్లుగా మహిళలకు ఒక్కసారి కూడా అవకాశం దక్కలేదు. కానీ, ఆ చరిత్రను తిరగరాస్తూ ఈతరం పార్టీ లీడర్లు కొత్త ఎత్తుగడలను పన్నుతున్నారు. ఇప్పడు కమలదళానికి మహిళా సారథి రాబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ తన రూట్ మార్చుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవడంతోపాటు దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో అధికారం చేలాయిస్తున్న బీజేపీని మరింతగా విస్తరించేందుకు కమలనాథులు చర్యలు తీసుకుంటున్నారు.
విపక్షాల ఏలుబడిలో ఉన్న ఐదారు రాష్ట్రాలను తమ ఖాతాలో వేసుకోవడానికి కాషాయ దళం ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ విజయాల్లో కీలకపాత్ర పోషించిన మహిళలను చేజార్చుకోకూడదని కమలం పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్ష పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. దీనికి ఆర్‌ఎస్‌ఎస్ కూడా పచ్చజెండా ఊపినట్లు సమాచారం.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్లను పార్టీ అగ్రనాయకత్వం అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరినో ఒకరిని అధ్యక్ష పదవి వరించనుంది. ఒకవేళ అదే జరిగితే కషాయ దళానికి తొలిసారిగా ఓ మహిళ సారథి రానున్నారు. కాగా, ఈ రేసులో ప్రధాని మోదీ కేబినెట్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముందంజలో ఉన్నారు. అయితే.. కేబినేట్‌లో కీలక ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న నిర్మలకు పార్టీ పగ్గాలు అప్పజెప్పే విషయంలో మోదీ ఊగిసలాటలో ఉన్నట్లు సమాచారం.. ఇక.. మంచి వాగ్థాటి ఉన్న నిర్మలకు కమల సారథ్యం ఇస్తే అటు కేంద్ర మంత్రి పదవిని, ఇటు పార్టీ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించగలరని మెజార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
నిర్మలా సీతారామన్..
పార్టీ అధ్యక్ష రేసులో నిర్మలా సీతారామన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవలే జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోశ్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీతారామన్ పేరునే చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా, రక్షణమంత్రిగా తానేంటో నిరూపించుకున్న ఆమెకు పార్టీలో సుదీర్ఘమైన అనుభవం ఉంది. అలాగే.. నాయకత్వ సామర్థ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమె నియామకంతో దక్షిణాదిలో పాగా వేయాలన్న లక్ష్యం కూడా నెరవేరే అవకాశం ఉందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కలిసొచ్చే అవకాశం కానున్నట్టు తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్న మోదీ సర్కార్.. త్వరలోనే ఈ బిల్లును ఆమోదించాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మల అయితేనే సరైనవారని పార్టీ అగ్రనాయకత్వం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెకు ఆర్ఎస్ఎస్ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపినట్టు సమాచారం.
వానతి శ్రీనివాసన్..
తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్ పేరు కూడా అధ్యక్ష రేసులు ప్రముఖంగా వినిపిస్తోంది. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన ఆమె ప్రస్తుతం కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1993లో బీజేపీలో చేరిన వానతి అంచలంచలుగా ఎదుగుతూ.. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2020లో ప్రమోషన్ పొందిన ఆమె.. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అనంతరం 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా నియమితులై.. తమిళనాడు నుంచి ఈ పదవి పొందిన మొదటి మహిళగా నిలిచారు.
దగ్గుబాటి పురందేశ్వరి..
బహుభాషా కోవిధురాలైన రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ పురందేశ్వరి కూడా పార్టీ జాతీయ అధ్యక్ష రేసులో నిలిచారు. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న పురందేశ్వరి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలపడుతోంది. ఆపరేషన్ సిందూర్‌పై వివిధ దేశాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధుల బృందంలోనూ పురందేశ్వరి ఉన్నారు.
పదవీకాలం ముగిసిన నడ్డా..
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పదవీకాలం రెండేండ్ల క్రితమే (2023, జనవరి) ముగిసింది. అయితే.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పదవీకాలాన్ని 2024 జూన్ వరకు పొడిగించారు. నూతన అధ్యక్షుడిని ఎంపిక చేయకపోవడంతో ఆయన ఇంకా ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో అధ్యక్షుడి మార్పు తప్పనిసరి అయింది. దీంతో పార్టీ అగ్రనాయకత్వం అధ్యక్ష మార్పుపై తీవ్ర కసరత్తు చేస్తోంది.