హైదరాబాద్: బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలకు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేవైఎం కార్యకర్తలను సైతం అరెస్ట్ చేశారు. అనంతరం మహేశ్వర్ రెడ్డిని బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
400ఎకరాల సెంట్రల్ యూనివర్శిటీ భూమిని ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అయితే వీరికి మహేశ్వర్ రెడ్డి మద్దతు ప్రకటించి వారితో పాటు నిరసనకు దిగారు. దాంతో మహేశ్వర్ రెడ్డిని పలువురు బీజేవైఎం కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. ఆపై అసెంబ్లీకి పోలీస్ వాహనంలో తీసుకొచ్చారు. పోలీస్ వాహనం దిగకుండా మహేశ్వర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు పోలీస్ వాహనంలో ఎందుకు తిప్పారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన బీజేవైఎం కార్యకర్తల్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేల నిరసన…
బీజేవైఎం కార్యకర్తలను, తనను పోలీసులు నిర్భంధించడంపై అసెంబ్లీ ప్రాంగణంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇతర బీజేపీ నేతలతో కలసి నిరసనకు దిగారు. అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో ఏలేటితో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్, పాల్వాయి హరీష్, దన్ పాల్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.