BJP | మృతుడి భార్య సత్యమ్మకు రూ.10 లక్షల చెక్కును అందజేసిన కిషన్ రెడ్డి..

BJP | మృతుడి భార్య సత్యమ్మకు రూ.10 లక్షల చెక్కును అందజేసిన కిషన్ రెడ్డి..
BJP | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ అభ్యర్థిగా 6వ వార్డు నుండి పోటీ చేసి అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఎరుకలి మహదేవప్ప కుటుంబానికి బీజేపీ పూర్తి అండగా ఉంటుందని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు. అన్ని విధాల కుటుంబాన్ని అండగా ఉండి ఆదుకుంటామన్నారు. మంగళవారం ఆత్మహత్య చేసుకున్న మహాదేవప్ప కుటుంబాన్ని బుధవారం రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు సభ్యులు డికె.అరుణ స్థానిక బీజేపీ నాయకులు కొండయ్యతో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని చందాపూర్ గ్రామంలో మృతుడి కుటుంబాన్ని ఇంటికి వెళ్లి భార్య సత్యమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ పక్షాన రూ. 10 లక్షల చెక్కును మృతుడి భార్య సత్యమ్మకు మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన ఎరుకలి మహాదేవప్ప ఆత్మహత్యకు పాల్పడడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. పార్లమెంటు సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తాను తెలుగులో మాట్లాడడం జరిగిందని.. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడాలని అన్నారు. తాను పార్లమెంటులో ఎరుకలి మహదేవ ఆత్మహత్య సంఘటనను ప్రస్తావించిన తక్షణమే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మక్తల్ వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించమని ఆదేశించారని తెలిపారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు రాత్రి మక్తల్ రావడం జరిగింది అన్నారు.

మున్సిపాలిటీకి దూరంగా ఓ గ్రామంలో రాత్రి బస చేసి ఇక్కడ 6వ వార్డులో పోలింగ్ నిలిపియడం వల్ల ఇక్కడికి వచ్చాను అన్నారు. రాజకీయాల్లో బెదిరింపులు దిగడం మంచిది కాదని అన్నారు. మహాదేవప్ప మరణం బాధాకరమని ఆ కుటుంబం అధైర్యపడకుండా కుటుంబానికి బీజేపీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సంఘటన పై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి చట్టరీత్యా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి గంగిపురం కిషన్ రెడ్డి సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంబడి బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, కొండయ్య, కొత్త కాపు రతంగపాండు రెడ్డి, స్థానిక నాయకులు జి.బలరామిరెడ్డి, జయానందన్ రెడ్డి, చిట్యాల లక్ష్మణ్, బ్యాటరీ రాజు తదితరులు ఉన్నారు.
CLICK HERE TO READ ఓటు హక్కు ఉన్న ఉపాధ్యాయులు స్పెషల్ సీఎల్ వినియోగించుకోవచ్చు..
