Bikkanur | ఆదర్శ పట్టణంగా మారుస్తా..

Bikkanur | ఆదర్శ పట్టణంగా మారుస్తా..
Bikkanur, ఆంధ్ర ప్రభ : ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే.. బిక్కనూరు పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి పెద్ద బచ్చ మైత్రి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఉన్నత చదువులు చదువుకొని విదేశాలలో స్థిరపడినా.. ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో బిక్కనూరు మండల కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా పట్టణ సర్పంచిగా పోటీ చేస్తున్న ఆమె పట్టణంలో విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె భర్త శ్రీధర్ రెడ్డి గతంలో ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సైతం ఆయన భాగస్వామ్యమై ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ప్రజా సమస్యలపై గొంతు విప్పుతున్న శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో ఆమె సర్పంచి బడిలో నిలిచారు.
తమను గెలిపిస్తే ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని అన్నారు. పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యా అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. లాభదాయక వ్యవసాయం జరిగే విధంగా ఉద్యాన పంటల ప్రోత్సాహానికి అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు. అంకాపూర్ తరహాలలో వ్యవసాయం జరిగే విధంగా కృషి చేస్తానని చెప్పారు. పట్టణ చుట్టుపక్కల్లో గల కంపెనీలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తానని హామీ ఇచ్చారు. విద్యావంతురాలుగా తమకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు.
