రంగురంగుల కెమికల్స్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలు ఆకర్షణీయంగా ఉండొచ్చు కానీ, పర్యావరణానికి అవి చాలా హాని కలిగిస్తాయని పర్యావరణశాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నారు. అందుకు ఫలితంగా ప్రజల్లో కూడా చైతన్యం కలగడం హర్షించదగ్గ శుభపరిణామం.

కొన్ని స్వచ్చంద సంస్థలు, పురపాలక సంఘాలు మట్టిగణపతుల ప్రతిమలను చౌక ధరలకు అందించి ఈ ఉద్యమానికి ప్రోత్సాహమందిస్తున్నాయి. స్కల్ప్‌చర్‌‌లో నైపుణ్యం కలిగిన చిన్నారులు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మట్టి గణపతులు తయారు చేసి రికార్డు సృషించారు.

వివరాలిలా ఉన్నాయి…

వినాయక చవితి సందర్భంగా ‘పర్యావరణ హిత గణేష్ చతుర్థి జరుపుకుందాం.. పర్యావరణాన్ని కాపాడుదాం’ అనే నినాదంతో వినూత్న కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియంలో వివిధ కళాశాలల విద్యార్థులతో 2 వేల విగ్రహాల తయారు చేయించింది.

నగరంలో మరో 10 విద్యా సంస్థలలో మరో 3 వేల విగ్రహాల తయారీ చేయించింది యంత్రాంగం. మట్టి గణపతిని పూజించడం పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా వినూత్న కార్యక్రమం నిర్వహణ జరిగింది.

ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లి గణేశా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య, కలెక్టర్ లక్ష్మీశా, మున్సిపల్ కమిషనర్ జ్ఞాన్ చంద్ ఇతర అధికారులు చిన్నారులను ప్రశంసించారు.

మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నందుకు జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. విద్యార్థులు, కుమ్మరి సోదరుల ప్రమేయంతో 5 వేల విగ్రహాల తయారీ చేయడం శుభపరిణామం, గతంలో గణేష్ ఉత్సవాల అనుమతుల కోసం ఇబ్బందులు పడాల్సిన వచ్చేది.. ఇప్పుడా పరిస్థితి లేదు. ఉచితంగా గణేష్ విగ్రహాల ఏర్పాటుకు, ఉచితంగా కరెంట్ ఇచ్చేందుకు కృషి చేసిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు.

గణేష్ ఉత్సవాలు ఎలా చేయాలి, ఎలాంటి భక్తి పాటలు ఉండాలి అని దానిపై కూడా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేశాము. గణేష్ ఉత్సవాలలో చేసే ప్రతీ కార్యక్రమం వెనకా ఒక విశిష్టత ఉంది. కానీ మధ్యలో పీఓపీ విగ్రహాలు వాటి వల్ల తర్వాత ఎన్నో ఇబ్బందులు రావడం మొదలైయ్యాయి. కాన్సర్ కేసులు పెరగడానికి ఇలాంటి పిఓపి విగ్రహాలు కూడా ఓ కారణం.

గణేష్ ఉత్సవాల్లో డీజే ఉండాలి.. అయితే స్వీయ నియంత్రణ ఉండాలి. వినాయక విగ్రహాల సినిమా పాటలు కాకుండా భక్తి పాటలు పెట్టుకోవాలి. సినిమా హీరోల స్టైల్ లో గణేష్ విగ్రహాలు పెడుతున్నారు.. అలాంటివి కరెక్ట్ కాదు. వినాయక ఉత్సవాలను అవమానపరిచే విధంగా యువత చర్యలు ఉండకూడదు. మండపాలు నిర్వహించే వారు ఇవన్నీ కచ్చితంగా పాటించాలి.” అన్నారు.

ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ..” విజయవాడ నగరం అంటేనే ఒక చైతన్యం కలిగిన నగరం. విజయవాడ నగరానికి వరుస అవార్డులు రావడానికి అధికారుల కృషి తో పాటు నగర ప్రజల ప్రమేయం కూడా ఓ కారణం. అందుకే విజయవాడ అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుటుంది. ప్రభుత్వం గణేష్ విగ్రహాల వద్ద ఉచిత కరెంట్ ఇచ్చారు.. అలాగే విజయవాడ సీపీ కూడా డీజే సౌండ్స్ కు ఉచితంగా పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నా. అధికారుల ప్రోత్సాహంతో మున్ముందు విజయవాడలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతాం.” అన్నారు.

ఈ మట్టిగణపతులు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ప్రయత్నాల స్ఫూర్తితో ప్రజలందరూ ఈ మట్టివిగ్రహాలనే కొని, పూజించి పర్యావరణానికి మేలు చేయాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. నిజానికి ఈ మట్టి గణపతులే పూజకు శ్రేష్టమని పురాణాల్లోనూ ఉంది. ఎందుకంటే మట్టితో తయారు చేసిన గణపతులు నీటిలో తేలికగా కరిగిపోతాయి. సాకారం నుండి గణేశుడు నిరాకారానికి వెళ్ళడమే ఈ పండుగ యొక్క, నిమజ్జనం యొక్క పరమార్థం. బెజవాడ వేదికగా ఈ రికార్డు సాధించిన చిన్నారులను మనస్పూర్తిగా అభినందిద్దాం.

Leave a Reply