Bhupalpalle | సింగరేణి ఓసీ- 2లో ప్రమాదం.. ఒకరు మృతి

Bhupalpalle | సింగరేణి ఓసీ- 2లో ప్రమాదం.. ఒకరు మృతి
Bhupalpalle | ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ – 2లో ఈ రోజు ఘోర ప్రమాదం జరిగింది. గ్రేడర్ వాహనం ఢీ కొని ఎస్వీఈసీ ప్రైవేట్ కంపెనీకి చెందిన సూపర్వైజర్ శ్రీహరి మృతి చెందారు. ఉదయం శ్రీహరి గనిలో తన విధుల్లో భాగంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ నడుస్తున్న ఒక గ్రేడర్ వాహనం అదుపుతప్పి శ్రీహరిని బలంగా తాకింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
ప్రమాదాన్ని గమనించిన తోటి కార్మికులు, అధికారులు శ్రీహరిని ప్రాథమిక చికిత్స నిమిత్తం భూపాలపల్లిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే శ్రీహరి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు శ్రీహరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చి ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ ప్రమాదానికి గురై మరణించడంతో తోటి కార్మికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
