గంటలోపే భవానీలకు అమ్మ దర్శనం..

  • నిరంతరాయంగా అమ్మ దర్శన ఏర్పాట్లు..
  • లోపాలు సవరిస్తూ ఏర్పాట్లు చేస్తున్నాం..
  • పారిశుధ్యం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం..
  • ప్రసాదాల నాణ్యత మరింతగా పెంచాం..
  • ప్రశాంత వాతావరణంలో దీక్ష విరమణ నిర్వహిస్తాం..
  • దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధీ)

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రాష్ట్రం నలుమూలల నుండి…. పొరుగు రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో తరలివచ్చే భవానీలందరికీ గంటలోపే అమ్మవారి దర్శన భాగ్యం కలిగించేలా పకడ్బందీ ప్రణాళికలతో ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధీ) తెలిపారు.

నగరంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న జమ్మిదొడ్డిలో ట్రస్ట్ బోర్డు సమావేశం అనంతరం దుర్గగుడి ఈవో శీనా నాయక్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… భవానీ దీక్షా‌ విరమణలు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులు సభ్యులతో కలిసి చర్చించామన్నారు.

ఈ నెల 11 వ తేదీ నుంచి జరిగే భవానీ దీక్షా విరమణలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాట్లు ప్రకటించారు. ఐదు రోజుల పాటు భవానీ దీక్షా విరమణలు జరగనున్నాయని, అమ్మవారి దర్శనం గంట లోపే అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

భవానీ దీక్షా విరమణలకు మూడు హోమగుండాలు ఏర్పాటు చేశామని, విరమణ గావించేందుకు 106 బళ్ళలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురు భవానీలు సేవ చేయాలంటే తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని, దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు 24 గంటలు అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించారు.

చిన్న చిన్న లోపాలను సవరిస్తున్నామని, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, ప్రసాదాల నాణ్యతను పెంచాలని నిర్ణయించనున్నట్లు తెలిపారు. భక్తులు ఎన్ని లడ్డులు అడిగితే అన్ని ఇచ్చేలా ఏర్పాట్లు చేశమని చైర్మన్ గాంధీ వివరించారు.

Leave a Reply