డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితం అంధకారమే

డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితం అంధకారమే
యువత అత్యుత్తమ లక్ష్యాలతో ముందుకు సాగాలి
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితం అంధకారమేనని, ప్రతిఒక్కరూ డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ సూచించారు. మండల పరిధిలోని కేతనకొండ ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, పోలీసుశాఖ ఉన్నతాధికారులతో కలిసి డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే వసంత హాజరై మాట్లాడారు.
యువత అత్యుత్తమ లక్ష్యాలను నిర్దేశించుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి రాజశేఖరబాబు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంపై ప్రజాప్రతినిధులను, ప్రజలను, యువతను భాగస్వామ్యం చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తూ అందరినీ చైతన్య పరుస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ బారినపడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మత్తు పదార్థాలు వినియోగించడం నేరమన్నారు.
ఒక్కసారి డ్రగ్స్ ఊబిలోకి దిగితే బయటపడటం ఎవరి చేతుల్లో ఉండదన్నారు. వారి కుటుంబాలకు కూడా దూరం అవుతారన్నారు. డ్రగ్స్ మత్తు పదార్థాలు వాడకుండా నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. విద్యార్థులు చక్కగా చదివి తమ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని కోరారు. 36 రోజులు 500 కిలోమీటర్లకుపైగా ‘డ్రగ్స్ పై దండయాత్ర’ పేరుతో సైకిల్ యాత్ర చేసిన మహిళా పోలీసులు రేవతి, హైమావతి, శైలజ, త్రివేణి, ఉషారాణిలను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్డీయే కూటమి నేతలు పాల్గొన్నారు.
