క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం…

క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం…

జిల్లా పోలీసుల కఠిన హెచ్చరికలు

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌లపై జిల్లా పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. బెట్టింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్నా, నిర్వహించినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ గ్యాంగ్‌లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రికెట్‌ను జూదంగా మార్చి అమాయకుల జీవితాలతో ఆడుకునే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ముఖ్యంగా యువత బెట్టింగ్ మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

బెట్టింగ్ అనేది వినోదం కాదని, అది ప్రమాదకరమైన వ్యసనమని ఆయన పేర్కొన్నారు. యువత ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే స్పందించాలని కోరారు. జిల్లా పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెంచి బెట్టింగ్ గ్యాంగ్‌లపై చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ హామీ ఇచ్చారు.

Leave a Reply