ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన సౌకర్యాలు

ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన సౌకర్యాలు

  • దుర్గా ఘాట్ లో భక్తులకు అదనపు సౌకర్యాలు
  • భక్తుల రద్దీ నియంత్రణకు నూతన మార్గాల ఏర్పాటు..
  • క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించిన ఈఓ

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కు విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో కృష్ణానది తీరంలోని దుర్గా ఘాట్ ప్రాంతంలో బుధవారం క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన నిర్వహించారు.

దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శీనా నాయక్ ఇంజనీరింగ్ విభాగం ఈఈ-2 రమాదేవి సంయుక్తంగా ఘాట్ పరిసరాలను పరిశీలించారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చే సందర్భాల్లో రద్దీని నియంత్రించడం, స్నానఘట్టాలకు సురక్షితంగా చేరుకునే మార్గాలను మెరుగుపరచడం వంటి అంశాలపై అధికారులు సమగ్రంగా సమీక్షించారు. ప్రస్తుతం భక్తులు ఉపయోగిస్తున్న సబ్‌వేల ద్వారా రాకపోకలు మరింత సులభంగా ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

అలాగే భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దుర్గా ఘాట్‌కు చేరుకునే విధంగా నూతన మార్గాలను కూడా ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రద్దీ పెరిగే రోజుల్లో తొక్కిసలాటకు అవకాశం లేకుండా భక్తులు సులభంగా వెళ్లి రావడానికి ఈ మార్గాలు ఉపయోగపడతాయని తెలిపారు. స్నానఘట్టాల వద్ద భక్తులకు తాగునీరు, భద్రతా ఏర్పాట్లు, ఇతర కనీస వసతులు మెరుగుపరిచే దిశగా కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే సందర్భాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply