Bellampalli | బల్దియా పోరు.. ‘బీ-ఫామ్’ భయం..

Bellampalli | బల్దియా పోరు.. ‘బీ-ఫామ్’ భయం..

Bellampalli | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఇప్పుడు ‘బీ-ఫామ్’ చుట్టూ తిరుగుతోంది. నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగియడంతో అసలైన టికెట్ల వేట మొదలైంది. ఫిబ్రవరి 3న అభ్యర్థుల తుది జాబితా వెలువడనున్న నేపథ్యంలో, ఏ వార్డు నుంచి ఎవరికి పార్టీ అధికారిక టికెట్ దక్కుతుందన్నది ఉత్కంఠగా మారింది. మున్సిపాలిటీలోని 34 వార్డులకు గాను మొత్తం 361 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం 279 నామినేషన్లు ఆమోదం పొందాయి. ప్రస్తుతం బరిలో 252 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రతి వార్డు నుంచి 10 నుంచి 15 మంది పోటీ పడుతుండటంతో, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో టికెట్ల సర్దుబాటు నాయకత్వానికి పెను సవాలుగా మారింది.

ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద క్యూ.. ‘ధన’ మంత్రం!

అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం పైరవీలు పతాక స్థాయికి చేరాయి. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంప్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే దృష్టిలో పడేందుకు భారీ ప్రదర్శనలు నిర్వహిస్తూ తమ బలాన్ని చాటుకుంటున్నారు. “పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డాం.. ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వాల్సిందే” అంటూ కొందరు ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు, టికెట్ కోసం ‘ధన’ మంత్రం కూడా వినిపిస్తోంది. “బడా నేతలకు మొక్కులు మొక్కుతాం.. మాకు కౌన్సిలర్ టికెట్ ఇప్పించండి.. ఎన్నికల ఖర్చు కోసం లక్షలు కుమ్మరిస్తాం” అంటూ కొందరు ఆశావహులు బాహాటంగానే మంతనాలు జరుపుతున్నారు. “నా దగ్గర పైసలు ఉన్నాయ్.. పార్టీకి గెలుపు గుర్రాన్ని అవుతా” అంటూ ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులు పైస్థాయి నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే ఓటర్ల గణాంకాలు మరియు నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం ఓటర్లు: 44,575, మహిళా ఓటర్లు: 23,012 (పురుషుల కంటే 1,452 మంది అధికం), పురుష ఓటర్లు: 21,560, ఇతరులు: 3, పార్టీల వారీగా నామినేషన్ల ఆమోదం, కాంగ్రెస్ : 123 నామినేషన్లు, బీఆర్ఎస్ : 81 నామినేషన్లు, బీజేపీ : 27 నామినేషన్లు, బీఎస్పీ : 10 నామినేషన్లు, స్వతంత్రులు : 21 మంది.

చైర్మన్ పీఠం ‘మహిళా జనరల్’ కావడంతో చైర్మన్ పదవి ఆశిస్తున్న దావ స్వాతి, మత్తమారి సరస్వతి, జక్కుల శ్వేత, బండి ఉమాదేవి తమ తమ వార్డుల్లో గెలవడంతో పాటు, తమకు అనుకూలమైన వారికి కౌన్సిలర్ టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాతే ‘బీ-ఫామ్’ ఎవరికి దక్కిందో.. ఎవరు బరిలో ఉన్నారో అన్న పూర్తి స్పష్టత రానుంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాలు వెలువడనున్నాయి. అంతవరకు బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఆశావహుల కోలాహలం, ‘లక్షల’ ఆఫర్ల మంతనాలు కొనసాగుతూనే ఉండేలా కనిపిస్తున్నాయి.

Leave a Reply