Achampet | ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి

Achampet | ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి
బీసీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నారమోని నరేష్ యాదవ్
Achampet | అచ్చంపేట, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల (sarpanch elections) పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు బీసీ వర్గాలపై మరోసారి అన్యాయంగా మారుతున్నాయని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నారమోని నరేష్ యాదవ్ (Dr. Naramoni Naresh Yadav) ఆవేదన వ్యక్తం చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధత పొందిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించడం సరైన పద్ధతి అని స్పష్టం చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు పార్టీల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలనే సూచనలు చేయడం పూర్తిగా అసంబద్ధమని ఆయన విమర్శించారు.
సర్పంచ్ ఎన్నికలు (sarpanch elections) పార్టీ గుర్తులు లేకుండా నిర్వహించే సందర్భంలో పార్టీ ఆధారిత రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది బీసీలపై మరోసారి మోసం చేయాలనే ప్రయత్నంగా కనిపిస్తోందని నరేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండానే ఎన్నికలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు తప్పవని హెచ్చరించారు. బీసీలను మసి పూసి మారేడు కాయలు చేసినట్టు మోసం చేయాలని చూస్తున్న రాజకీయ పార్టీల (Political parties) అసలు స్వరూపం ప్రజలకు అర్థమైపోయిందని, రాబోయే రోజుల్లో అటువంటి పార్టీలను బీసీ వర్గాలు పాతరేస్తాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, రిజర్వేషన్లను పూర్తిగా అమలు చేసిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలు జరిపించాలని బీసీఫ్ నాయకుడు డిమాండ్ చేశారు.
