హైదరాబాద్ : వేసవి కాలం పూర్తిగా రాకముందే నీళ్లు లేక 10లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నా.. ప్రభుత్వానికి అన్నదాతల ఆక్రందనలు వినిపించడం లేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాలువల్లో నీళ్లు ఉన్నా ఎందుకు వదలడం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి రైతులు మూల్యం చెల్లించాలా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు పడిపోతుండడంతో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో బోర్ల నుంచి నీరు రాక యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. ఎలాగైనా తమ పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు ఎక్కువ లోతుతో బోరు బావులు తవ్విస్తూ నీరు పడక అప్పులపాలు అవుతున్నారు. కోత దశకు వచ్చే సమయంలో పంటలు ఎండుముఖం పడుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అన్నదాతలు అల్లాడుతున్నాడు. వడ్డీలకు తెచ్చి పంట సాగు చేస్తే తాము ఆర్థికంగా చితికిపోతున్నామని రైతన్నలు కంటిమీద కనుకు లేకుండా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు.
నీటి విడుదల అంశాన్ని సైతం సులువుగా కేంద్ర ప్రభుత్వంపై నెట్టేసి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తప్పించుకోవాలని అనుకుంటోందని అన్నారు. కనీసం రైతన్నలకు పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదని ఆక్షేపించారు. ఇదేనా కాంగ్రెస్ మార్క్ రైతు సంక్షేమ రాజ్యమని ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై వెంటనే అసెంబ్లీలో చర్చించాలని.. కష్టాల్లో ఉన్న రైతంగాన్ని ఆదుకోవాలని అన్నారు. అదేవిధంగా యాసంగి పూర్తయ్యేంత వరకు పంటలకు నీళ్లు వదలాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.