మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి

  • బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 3, 5, 6 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భీమ్‌గల్‌ను గ్రామ స్థాయి నుంచి మున్సిపాలిటీ గా మార్చడమే కాకుండా సుమారు 200 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు.

గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి వల్ల భీమ్‌గల్‌లో భూముల మార్కెట్ విలువ పెరిగింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.భీమ్‌గల్‌లో మిగిలిపోయిన అదనపు పనుల కోసం తాను 10 కోట్ల రూపాయలు మంజూరు చేశానని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా ఆ పనులను రెండేళ్లుగా నిలిపివేసిందని ఆరోపించారు.పనులు ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి,ఎన్నికలు రాగానే శంకుస్థాపనల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం లింబాద్రి గుట్టకు వెళ్లే రోడ్డును సెంట్రల్ లైటింగ్, డివైడర్‌తో పాటు 4 లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయడంతో పాటు గిరి ప్రదక్షిణ రోడ్డును కూడా పూర్తిచేశామని గుర్తు చేశారు.

అలాగే నిజామాబాద్, ఆర్మూర్ వెళ్లాల్సిన అవసరం లేకుండా భీమ్‌గల్‌లోనే వైద్యం అందాలనే ఉద్దేశంతో 40 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి 80 శాతం పనులు పూర్తి చేశామని, అయినా మిగిలిన పనులు చేయకుండా ఆసుపత్రిని ప్రారంభించకపోవడం దురదృష్టకరమన్నారు. 6 కోట్లతో ప్రారంభించిన మార్కెట్ పనులు, భీమ్‌గల్ బస్ డిపోను కూడా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. బస్ డిపోలో బస్సులు లేవని, కంట్రోలర్లు కూడా లేరని అక్కడ బర్లు పడుకుంటున్నాయని విమర్శించారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు.మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి 25 నెలలైనా ఒక్క రూపాయి ఇవ్వలేదని, అంటే ఒక్కో మహిళకు రూ.62,500 బాకీ పడిందని వ్యాఖ్యానించారు.

అవ్వాతాతలకు 4000 రూపాయల పింఛన్ ఇవ్వక గత 25 నెలల్లో 50 వేలు బాకీ పడింది అన్నారు. తులం బంగారం, రైతు రుణమాఫీ, రైతుబంధు హామీలు అన్నీ మాటలకే పరిమితమయ్యాయని తెలిపారు.ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే తీర్పు రావాలని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రభుత్వం భయపడి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు. బీజేపీకి ఓటు వేసి ఓటును వృథా చేసుకోవద్దని కోరారు. తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రానికి అధిక పన్నులు వెళ్తున్నా, కేంద్రం మాత్రం నిధులు కేటాయించడంలేదని, రాష్ట్రం నుండి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రజలతో కలిసి ఉంటారని, సమస్య వచ్చిన వెంటనే ప్రజల పక్షాన నిలబడతారని తెలిపారు. తాను చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేసుకుని భీమ్‌గల్ భవిష్యత్తు కోసం కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బోదిరే లావణ్య నర్సయ్య, నీలం లావణ్య గంగాధర్, మూత లింబాద్రిలను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి భీమ్‌గల్ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతానని మా అభ్యర్థులను గెలిపించండి మిగిలిపోయిన పనులన్నింటిని దగ్గరుండి పూర్తి చేయిస్తామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, జెడ్పిటిసి చౌటుపల్లి రవి, మాజీ కో నెంబర్ శోభ భూపతి రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు,వివిధ కుల సంఘాల సభ్యులు, మహిళలు యూత్ యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply