BABY | ఆ కేసులో తల్లి, నాయనమ్మ అరెస్ట్

BABY | ఆ కేసులో తల్లి, నాయనమ్మ అరెస్ట్

BABY | మోపిదేవి, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో ఇటీవల జరిగిన శిశువు మృతి ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన వీరమాచనేని హితేష్ (26) ఫిర్యాదు మేరకు, అతని సోదరి రావి సాయి చైతన్యకు వెంకటాపురం గ్రామానికి చెందిన రావి ప్రభుకుమార్‌తో 2024లో వివాహం జరిగింది. వీరికి సుమారు 45 రోజుల క్రితం ఆడ శిశువు జన్మించింది. అయితే 01-01-2026 రాత్రి శిశువు ఇంటి పక్కనున్న సంపులో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు.

ఈ ఘటన పై అనుమానం వ్యక్తం చేసిన ఫిర్యాదు చేశారు. 02-01-2026న వెంకటాపురం వచ్చి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా సరైన సమాధానం లభించకపోవడంతో, శిశువు మరణం పై అనుమానంతో మోపిదేవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో Cr.No.02/2026, BNS సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు విచారణలో శిశువు నెలలు నిండక ముందే జన్మించడంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయని, చికిత్సకు అధికంగా ఖర్చు కావడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని వెల్లడైంది. ఈ క్రమంలో శిశువు నాయనమ్మ రావి వాణి తరచూ తల్లి రావి సాయి చైతన్యను చులకనగా మాట్లాడటం వల్ల ఆమె మనస్తాపానికి గురైందని పోలీసులు తెలిపారు.

01-01-2026న ఇంట్లో పురుషులు ఎవరు లేని సమయంలో, శిశువును నిద్రపుచ్చి బాత్రూమ్‌కు వెళ్లినట్లు నటించి, అనంతరం శిశువును నెట్‌లోంచి తీసి గుడ్డలో చుట్టి ఇంటి ప్రహరీ గోడ దాటి పక్కనే ఉన్న సంపులో విసిరివేసినట్లు విచారణలో తేలింది. అనంతరం ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తూ శిశువు కనిపించడం లేదని కుటుంబ సభ్యులతో కలిసి వెతికినట్లు నటించినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా భర్తను అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో శిశువు తల్లి రావి సాయి చైతన్యతో పాటు నాయనమ్మ రావి వాణి పాత్ర ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు, ఇద్దరినీ అరెస్ట్ చేశారు. చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావు నేతృత్వంలో నిందితులను స్థానిక జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Leave a Reply