కేంద్ర ప్రభుత్వం కీలకంగా మరో నిర్ణయం తీసుకుంది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) కొత్త చైర్మన్‌గా బి.పి. పాండేను నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం ఈ నియామకం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న నీటి వివాదాల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవలే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైన సమయంలో గోదావరి బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్న అంశంపై అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి తరుణంలో కొత్త చైర్మన్ నియామకం మరింత చర్చనీయాంశంగా మారింది.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు 2014 మే 28న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ఏర్పాటైంది. ఇది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ, గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం, నీటి పంపిణీ, రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారంలో కీలక భూమిక పోషిస్తుంది.
ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా ఏకే ప్రధాన్ విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ఆయన స్థానంలో కేంద్రం బి.పి. పాండేను నియమించింది. ముఖ్యంగా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ వంటి వివాదాస్పద అంశాలపై ఆయన దృష్టి ఎలా ఉండబోతుందన్నది రెండు రాష్ట్రాల్లో ఆసక్తికర అంశంగా మారింది.