AWARD | గురుకుల ఉపాధ్యాయునికి అవార్డు

ఉత్తమ సెమినార్ సర్టిఫికెట్ అందుకున్నపాండు నాయక్

AWARD | అచ్చంపేట, ఆంధ్రప్రభ : సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న సీనియర్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు, జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ సెమినార్ నిర్వహించారు. “మధ్యయుగ చరిత్ర రూపుదిద్దడంలో కోటలు, దర్గాలు, నిర్మాణాల ప్రాముఖ్యత” అనే ప్రధాన అంశంపై జరిగిన ఈ సెమినార్‌లో మధ్యయుగ కాలానికి చెందిన వివిధ రకాల కోటల నిర్మాణ శైలులు, ఆ కాలం సామాజిక–రాజకీయ వ్యవస్థలలో కోటలు, దర్గాల పాత్ర, చారిత్రక పరిణామాలు వంటి అంశాలపై నిపుణులు విలువైన ఉపన్యాసాలు అందించారు. సీనియర్ ఉపాధ్యాయులకు అవగాహన పెంపొందించడానికి, బోధనా విధానాల్లో వినూత్న మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించిన ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో కె. పాండు నాయక్, పీజీటీ, సాంఘిక శాస్త్రం, సెమినార్‌లో చురుకైన ప్రావీణ్యం, శిక్షణా కార్యక్రమంలో విశిష్ట ప్రతిభ కనబరచినందుకు నిర్వాహకుల చేత “ఉత్తమ సెమినార్ సర్టిఫికెట్” అందుకున్నారు.

Leave a Reply