మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో నేడు ఎంసీజీ వేధికగా జరిగిన మ్యాచ్ లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదటి మ్యాచ్ మనుకా ఓవల్‌లో వర్షం కారణంగా రద్దవ్వగా… ఈ విజయంతో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
బ్యాటింగ్ వైఫల్యం..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కేవలం 5 పరుగులకే జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ (37 పరుగులు) ఒంటరి పోరాటం చేసినా, ఇతర బ్యాటర్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు.
ఆఖర్లో యువ ఆటగాడు హర్షిత్ రాణా (35 పరుగులు) బ్యాట్‌తో మెరిశాడు. అభిషేక్‌తో కలిసి 56 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే, ఈ ఇద్దరూ మినహా మరే భారత బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయాడు.
ఆసీస్ బౌలర్లు మాత్రం భారత్ పై నిప్పులు చెరిగారు. హేజిల్‌వుడ్ (3/13), నాథన్ ఎల్లిస్ (2/21), జేవియర్ బార్ట్‌లెట్ (2/39) భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. ఫలితంగా, భారత్ 19 ఓవర్లలో కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయింది.
పోరాడి ఓడిన టీమిండియా..
126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ 51 పరుగుల భాగస్వామ్యంతో భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. అయితే, భారత బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. వరుణ్ చక్రవర్తి (2/23) హెడ్‌ను ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (2/45) దూకుడుగా ఆడుతున్న మార్ష్ (46)ను పెవిలియన్ చేర్చాడు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ సెట్టింగ్‌తో ఒత్తిడి పెంచగా, జస్ప్రీత్ బుమ్రా (2/27) వరుస బంతుల్లో మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్‌ను ఔట్ చేసి మ్యాచ్‌లో ఉత్కంఠను పెంచాడు. ఒకానొక దశలో 87/1తో ఉన్న ఆస్ట్రేలియా, భారత బౌలర్ల దాడికి కొద్దిసేపటికే 124/6కు చేరుకుంది.
అయితే, చివరికి మార్కస్ స్టాయినిస్ (6 నాటౌట్) కూల్‌గా ఆడి ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చాడు. తక్కువ స్కోరు కారణంగా భారత బౌలర్ల పోరాటం సరిపోలేదు. 14 ఓవర్లలోనే ఆస్ట్రేలియా విజయాన్ని నమోదు చేసి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

