భార్యపై దాడి…పరిస్థితి విషమం !

తాంసి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో భర్త భార్యపై దాడి చేసిన ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు… కప్పర్ల గ్రామానికి చెందిన మల్లెల నరేష్, మద్యం సేవించి ఇంటికి వచ్చి తన భార్య లావణ్యతో ఘర్షణకు దిగాడు. ఇటీవల లావణ్య ఫిర్యాదుతో నరేష్‌ను డవు సెంటర్‌కు తరలించగా, నెల రోజుల తరువాత మళ్లీ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తిరిగి గొడవ తీవ్రరూపం దాల్చి, కోపంతో నరేష్ తన భార్యపై ఇనుప రాడ్‌తో దాడి చేసినట్లు తెలిపారు.
భారీ రక్తస్రావంతో తీవ్రంగా గాయపడ్డ లావణ్యను కుటుంబ సభ్యులు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై లావణ్య బంధువు ఫిర్యాదు చేయగా, తాంసి ఎస్సై జీవన్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి సంఘటనతో కప్పర్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
