Assistant | తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి

Assistant | తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి
- ఆలయాన్ని సందర్శించిన దర్శకుడు బోయపాటి, ప్రముఖులు
Assistant | పెదకాకాని (గుంటూరు జిల్లా) ఆంధ్రప్రభ : మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ దైవ క్షేత్రమైన పెదకాకాని భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టడంతో రద్దీ పెరిగింది. పండుగ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తాగునీరు, అల్పాహారం, ప్రసాదం తదితర సౌకర్యాలు కల్పించారు. ఆదివారం నాడు మహాశివరాత్రి రావడంతో పెదకాకాని లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ రాహు కేతు పూజలకు ప్రశస్తం కావడంతో భక్తులు శివరాత్రి కలిసి రావడంతో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు.
దీపాలను వెలిగించి హరహర మహాదేవ అంటూ నినాదాలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా మండల కేంద్రమైన పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంను ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు సందర్శించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ లీలా కుమార్, చైర్మన్ పూర్ణచంద్రరావు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం బోయపాటి స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.





