ఆశా వర్కర్లకు అందని జీతాలు..

ఆశా వర్కర్లకు అందని జీతాలు..
– మూడు నెలలుగా వేతనాలు బకాయి
– ఆర్థిక ఇబ్బందుల్లో 31 మంది ఆశాలు
పాలకుర్తి, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించే ఆశా వర్కర్లు మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలు, వర్షాలు లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్య రక్షణ కోసం కష్టపడుతున్నప్పటికీ తమకు రావాల్సిన పారితోషికం సమయానికి అందకపోవడం పట్ల ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు బకాయిగా ఉండటంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి.
రెండు పీహెచ్సీల పరిధిలో 31 మంది ఆశా వర్కర్లు..
పాలకుర్తి మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మొత్తం 31 మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారు. బసంత్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నాలుగు సబ్ సెంటర్లు ఉండగా అక్కడ 18 మంది ఆశా వర్కర్లు సేవలు అందిస్తున్నారు. అలాగే పుట్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు సబ్ సెంటర్లు ఉండగా 13 మంది ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు ప్రజలకు చేరవేయడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఎండవానల మధ్య ఇంటింటికీ సేవలు..
ఎండలు, వర్షాలు లెక్కచేయకుండా గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ గర్భిణీల పర్యవేక్షణ, ప్రసూతి సేవల సమాచారం, టీకాల కార్యక్రమాలు, శిశు సంరక్షణ, పోషణ కార్యక్రమాలు, ఆరోగ్య సర్వేలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలు వంటి అనేక బాధ్యతలను ఆశా వర్కర్లు నిర్వర్తిస్తున్నారు. కరోనా సమయంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించిన ఆశా వర్కర్లు ప్రస్తుతం జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
నాలుగు రోజులుగా విధులకు దూరం
మూడు నెలలుగా వేతనాలు బకాయిగా ఉండటంతో ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేస్తూ గత నాలుగు రోజులుగా విధులకు దూరంగా ఉన్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు.
వేతనాలు లేక కుటుంబాల పై భారం..
మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆశా వర్కర్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంటి ఖర్చులు, పిల్లల చదువు, రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. తక్కువ పారితోషికంతో పని చేస్తున్నప్పటికీ అది కూడా సమయానికి అందకపోవడం అన్యాయమని ఆశా వర్కర్లు వాపోతున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించాలి..
ఆశా వర్కర్లకు బకాయి ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే విడుదల చేసి, ఇక పై ప్రతి నెలా సమయానికి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
