Arrive Alive | ప్రాణం విలువ తెలుసుకో.. హెల్మెట్ ధరించు

Arrive Alive | ప్రాణం విలువ తెలుసుకో.. హెల్మెట్ ధరించు

• బెల్లంపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం
• ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వినోద్
• కొత్తపల్లి నరేష్ జ్ఞాపకార్థం తమ్ముడు శ్యామ్ వితరణ

Arrive Alive | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాలు కోల్పోవడం అత్యంత ఆందోళనకరమని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి సబ్‌డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా కొత్తపల్లి నరేష్ జ్ఞాపకార్థం ఆయన తమ్ముడు కొత్తపల్లి శ్యామ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన హెల్మెట్లను ఎమ్మెల్యే, పోలీస్ అధికారులతో కలిసి వాహనదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత వేగంతో కాకుండా వివేకంతో వాహనాలు నడపాలని, చిన్న నిర్లక్ష్యం కుటుంబాలను వీధిన పడేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ చేపడుతున్న ఇటువంటి అవగాహన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. తన సోదరుడి జ్ఞాపకార్థం హెల్మెట్లు పంపిణీ చేసిన కొత్తపల్లి శ్యామ్ సేవా దృక్పథం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మరణాలు సంభవిస్తున్నాయని, ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, కాంగ్రెస్ లీడర్లు మునిమంద రమేష్, దావ రమేష్, మత్తమారి సూరిబాబు, చిలుముల శంకర్, నాతరి స్వామి, రొడ్డ శారద, జమ్మికుంట విజయ్, రేగుంట రాజలింగు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply