ప్రాణనష్టం లేని రీతిలో కృష్ణాజిల్లాలో పకడ్బందీ ప్లాన్

ప్రాణనష్టం లేని రీతిలో కృష్ణాజిల్లాలో పకడ్బందీ ప్లాన్

( ఆంధ్రప్రభ, మచిలీపట్నం ప్రతినిధి) : మొంథా తుఫాన్ తీవ్రతను ఎదుర్కునేందుకు కృష్ణా జిల్లా (Krishna District) యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ బాలాజీ సోమవారం ఉదయం నుంచి కలిసి కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయా తహసిల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ విభాగాలను, సురక్షిత పునరావాస కేంద్రాలను సందర్శించారు. అక్కడ చేపట్టిన తుఫాను సహాయక ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత కృత్తివెన్ను మండలం కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన తుఫాన్ కంట్రోల్ విభాగాన్ని పరిశీలించారు.కృత్తివెన్ను మండలం వర్లగుంది తిప్పలోని తుపాన్ షెల్టర్ ను పరిశీలించారు. అనంతరం బంటుమిల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలోని కంట్రోల్ విభాగాన్ని, ఆ మండలం ముంజులూరు గ్రామంలోనీ జడ్పీ ఉన్నత పాఠశాలలోని సహాయక పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు.

పెడన (Pedana) మండల తహసీల్దార్ కార్యాలయంలో తుపాన్ కంట్రోల్ విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని మండల తహసిల్దార్ కార్యాలయాల్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తుపాను సహాయక ఏర్పాట్లపై సమీక్షించారు. మచిలీపట్నం మండలంలోని గిలకలదిండి లోని తుఫాను పునరావాస కేంద్రాన్ని కృష్ణాజిల్లా ప్రత్యేక అధికారి ఆమ్రపాలి, , జాయింట్ కలెక్టర్ నవీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సిబ్బంది అందరూ కూడా వారి వారి ప్రధాన కార్య స్థానాల్లో అందుబాటులో ఉండాలన్నారు.

తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మంచినీరు ఎక్కడ కూడా కలుషితం కాకుండా చూడాలని అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా (Supply by tankers) చేయాలని సూచించారు. ఎక్కడైనా రహదారి మార్గాల్లో చెట్లు గాని, విద్యుత్ స్తంభాలు గాని పడిపోతే రాకపోకలకు అంతరాయం కలగకుండా వెంటనే వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ సౌకర్యాన్ని కూడా వెంటనే పునరుద్ధరించాలన్నారు. ఇందుకోసం అవసరమైన విద్యుత్ రంపాలను, క్రేన్లను తదితర యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ నెల 28వ తేదీన తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు వీచడంతోపాటు బీభత్సమైన వర్షము కురుస్తుందన్నారు.

జిల్లా యంత్రాంగం (District Administration) మొత్తం గ్రామ, మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అందరినీ అప్రమత్తం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాలు, కాలువ గట్లు, పూరిల్లు, తాటిపాకలు పెంకుటిల్లలో నివసిస్తున్న ప్రజలను వెంటనే తుపాను వలన ఇబ్బంది కలగకుండా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో ఈనెల 27, 28, 29 తేదీలలో అన్ని విద్యాసంస్థలకు సెలవు దినాలుగా ప్రకటించామని ప్రజలందరూ వారి ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ఎవరు కూడా బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పూరిల్లు, పాకలు, బలహీనమైన ఇళ్లల్లో ఉండే వారు వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు స్వచ్ఛందంగా రావాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రజలందరూ సహకరించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరికి ప్రాణం నష్టం జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. పునరావాస కేంద్రాలలో మంచినీరు ఆహారంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.

జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు (SP Vidyasagar Naidu) మాట్లాడుతూ.. ఈనెల 28 వ తేదీన తుఫాన్ ప్రభావం జిల్లాలో ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రధానంగా ఎక్కడైతే కరకట్టలు దెబ్బతినే అవకాశం ఉందో, ఇల్లు పడిపోవడానికి ఆస్కారం ఉందో వాటిపైన ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అటువంటి వాటిని గుర్తించి ఈ సోమవారం సాయంత్రానికి అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రెవిన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. సముద్రంలో ఆటుపోట్లు సాధారణంగా ఉంటాయని సముద్రం ముందుకు రావడం కూడా జరుగుతుందన్నారు సముద్రం నీరు గ్రామాల్లోకి రాకుండా పోలీసు సిబ్బందినీ నియమించే ఏర్పాటు చేస్తామ ప్రజలు ఎవరూ కూడా బీచ్ (సముద్ర తీర ప్రాంతాల) దగ్గరికి రావద్దని ఇప్పటికే ప్రజలకు తెలియజేశామన్నారు.

జిల్లా కలెక్టర్, మత్స్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని మత్యకారులు ఎవరూ కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదని ఇప్పటికే చెప్పడం జరిగిందన్నారు. గన్నవరం వంటి పట్టణ ప్రాంతాలు, మున్సిపాలిటీలలో కూడా ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి గత రెండు రోజులుగా ముందునుండే ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ ఎస్పీ వెంట గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి పోతురాజు, పెడన నియోజకవర్గ ప్రత్యేక అధికారి మార్క్ఫెడ్ జిఎం మురళీ కిషోర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నటరాజు, డి ఎల్ డి ఓ పద్మ, తహసిల్దారులు ఎంపీడీవోలు, జల వనరులు తదితర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply