కరీంనగర్, ఆంధ్రప్రభ : అసలు వీళ్ళు పట్టభద్రులేనా… చదువుకునే డిగ్రీ పాస్ అయ్యారా అనే అనుమానం తలెత్తే పరిస్థితులు దర్శనమిచ్చాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉండగా, 2,50,028 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం లో జరుగుతున్న కౌంటింగ్ లో 27,671 చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు.
ఇంత పెద్ద మొత్తంలో చెల్లని ఓట్లు వేసిన పట్టభద్రులను ఏమనాలని ఉమ్మడి నాలుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. చదువుకొని డిగ్రీ పాసైన వాళ్ళు కనీసం ఓటు ఎలా వేయాలని అవగాహన లేకపోతే ఎలా అని విమర్శిస్తున్నారు. పట్టభద్రుల నిర్లక్ష్యం ఎవరి కొంప ముంచుతుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పట్టభద్రుల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.