మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు నేటికీ మార్గదర్శకం…

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు నేటికీ మార్గదర్శకం…
నందికొట్కూరులో ఘన నివాళులు
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త గుజ్జుల గౌరీశ్వర నాయుడు సి.పి.ఐ. ఎమ్.ఎల్. లిబరేషన్ పార్టీ జనరల్ సెక్రటరీ పిక్కిలి వెంకటేశ్వర్లు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలే భారతదేశంలో సామాజిక చైతన్యానికి నాంది పలికిన మహోన్నత సంస్కర్త అని కొనియాడారు.
కులవివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం నేటికీ సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించిన పూలే తన జీవితమంతా అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేసి విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మి 1848లో బాలికల కోసం తొలి పాఠశాలను స్థాపించడం ద్వారా విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మహిళల అభివృద్ధి లేకుండా సమాజం ఎదగదని విశ్వసించిన పూలే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు పునర్వివాహాలకు మద్దతుగా ఉద్యమించి సమాజంలో మార్పుకు నాంది పలికారని, మహిళల హక్కుల పరిరక్షణలో ఆయన పాత్ర అమోఘమని కొనియాడారు.
1873లో స్థాపించిన సత్యశోధక సమాజం ద్వారా కులమత భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన రచనలు సమాజంలో చైతన్యాన్ని రగిలించాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సి.పి.ఐ. ఎమ్.ఎల్. లిబరేషన్ పార్టీ నాయకులు నరసింహులు యేసన్న బీబీ మూర్తుజాబీ తదితరులు, స్థానిక నాయకులు, సామాజిక కార్యకర్తలు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో పూలే ఆశయాలను ఆచరిస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పాల్గొన్నవారు సంకల్పం వ్యక్తం చేశారు.
