అమరావతి : ఏపీ ప్రజలలో నిరుద్యోగ యువతకు ఉపశమనాన్ని కలిగించేలా, ఉద్యోగ నియామక ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో కీలకమైన సంస్కరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణ విధానంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పెద్ద మార్పు చేసింది.
ఇప్పటివరకు 25,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాసే సందర్భంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబడుతుండగా, ఇకపై ఈ పద్ధతిని నిలిపివేశారు. తాజా మార్పు ప్రకారం, ఖాళీల సంఖ్యకు 200 రెట్లు ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటేనే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబడుతుంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది మరియు సంబంధిత ఉత్తర్వులు విడుదల చేసింది.
ఈ నిర్ణయం ద్వారా ఏపీపీఎస్సీకి ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల సంఖ్యను గణనీయంగా తగ్గించే అవకాశం లభిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగ నియామకాలను పూర్తి చేయవచ్చు. నిరుద్యోగులపై పరీక్ష భారం తగ్గడంతో వారికి ఆర్థికంగా, మానసికంగా ఉపశమనం కలుగనుంది.