MDK |ఆపదమిత్ర వాలంటీర్లు అవగాహన పెంపొందించుకోవాలి… రాహుల్ రాజ్

ఉమ్మడి మెదక్ బ్యూరో : జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా రక్షణ చర్యలో భాగంగా విపత్తు, సంసిద్ధత అనే అంశాలపై ఆపదమిత్ర వాలంటీర్లు అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.

జిల్లాలో 200మంది వాలంటీర్లకు శిక్షణ…
గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో గల టీఎన్జీవోస్ భవనం నందు యువజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణాధికారి వై దామోదర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, మెప్మా పీడీ ఇందిరాతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆప్దా మిత్ర వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత ప్రభుత్వం విపత్తు ప్రమాద తగ్గింపు, విపత్తు నిర్వహణ వ్యవస్థ పై దృష్టి పెట్టడం, విద్యా సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, సాంకేతిక పురోగతిని ఉపయోగించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అనగా వరదలు, భూకంపాలు, సునామీలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటి నుండి ప్రజల ప్రాణాలను, వారి ఆస్తులను ఎలా కాపాడాలనే వాటిపైన శిక్షణను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

మన జిల్లాలో ఎక్కువ ఉరుములు, విపత్తు గతంలో సంభవించిన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక వాలంటీర్లు ప్రజలను రక్షించేందుకు మానవతా జోక్యంలో శిక్షణ ఇవ్వాలని అన్నారు. శిక్షణ సమయంలో, కమ్యూనిటీ వాలంటీర్లకు విపత్తు నిర్వహణ, ప్రాథమిక శోధన అండ్ రక్షణ, అగ్ని భద్రతా చర్యలు, పాము కాటు, ఉరుములు, మెరుపులు, వరద, రక్షణ, ప్రాథమిక అంశాలను నేర్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply