ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
8 గంటల నుంచి 10 గంటలకు మార్పు
కార్మిక చట్టంలో సవరణ చేసిన సర్కారు
పెట్టుబడులు ఆకర్షించేందుకేనని స్పష్టత
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసమేనట
స్పష్టం చేసిన మంత్రి పార్థసారథి
పని గంటలు 10కి పెంచుతూ ఉత్తర్వులు జారీ
కేరళ, అసోం, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లోనూ ఇదే విధానం
వెలగపూడి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Governament) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పరిశ్రమల పని గంటలను పెంచుతూ ఉత్తర్వులు (orders) జారీ చేసింది. ఇకపై ప్రైవేటు రంగంలో(Private Sector) పనిచేసే ఉద్యోగులు పది గంటలు (Ten hours) పని చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల కోసం కార్మిక చట్టాల్లో భారీ మార్పులు చేపట్టింది. సవరించిన ‘ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీల చట్టం’ ప్రకారం ఇప్పటి వరకు 9 గంటలు పని చేసిన ఉద్యోగులు రోజుకు 10 గంటలు పని చేయాల్సి ఉంటుంది.
కార్మిక చట్టంలోని సెక్షన్ 54లో మార్పులు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 8 గంటలు పని చేయడానికి పరిమితి ఉండేది. కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెట్టుబడులు భారీగా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పని గంటల పెంపు కూడా ఒకటి. మ్యాన్‌పవర్ అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పని గంటలు కూడా 10 గంటలు చేస్తే పరిశ్రమలు వచ్చేందుకు మొగ్గు చూపుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పదేళ్ల క్రితం 8 గంటలుగా ఉన్న వర్కింగ్ అవర్స్‌ను 9 గంటలకుపెంచారు. ఇప్పుడు సెక్షన్ 54 కింద మార్పులు చేర్పులు చేసి 10 గంటలు చేశారు. దీనితో పాటు సెక్షన్ 55లో కూడా సవరణలు చేశారు. మొదట ఐదు గంటల పని తర్వాత అరగంట విరామం తప్పనిసరిగా ఉండేది, దీన్ని ఇప్పుడు ఆరు గంటల పని తర్వాత ఒక గంట విరామంగా మార్చారు.
ఓవర్ టైం గరిష్ట పరిమితిలో కూడా మార్పు
ఓవర్ టైం గరిష్ట పరిమితిలో కూడా మార్పులు చేశారు. మొదట ఇది 75 గంటలు ఉండగా, ఇప్పుడు 144 గంటలకు పెంచారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రి కె. పార్థసారథి మాట్లాడుతూ.. ఈ మార్పులు ప్రభుత్వ “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంలో భాగమని అన్నారు. నిబంధనలను కొద్దిగా సడలించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ పెట్టుబడులు వస్తాయని, వ్యాపారం చేయడం సులభం అవుతుందని ఆయన అన్నారు.
నిర్ణయాన్ని వ్యతిరేకించిన కార్మిక సంఘాలు..
పని గంటలు పెంచడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. కొత్త నిబంధనల కారణంగా ఫ్యాక్టరీ యజమానులు కార్మికులతో నిర్ణీత సమయం కంటే ఎక్కువ, అంటే రెండు గంటలు అదనంగా పని చేయించుకోవచ్చని వారు అంటున్నారు. దీనివల్ల ఉద్యోగులు రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేయాల్సి రావొచ్చు, ఇది వారి ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై పెను ప్రభావం చూపుతుందని అంటున్నారు.
ప్రత్యేక వెసులుబాటు ఉన్న రాష్ట్రాలివే..
భారత్ కార్మిక చట్టాలు, ఫ్యాక్టరీస్ ఆక్ట్-1948, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆక్ట్-1953 ప్రకారం ఎనిమిది గంటల వర్కింగ్ అవర్స్ మాత్రమే అమలులో ఉంది. కానీ ప్లాంటేషన్స్ శ్రామిక చట్టం, 1951 వంటి కొన్ని ప్రత్యేక చట్టాల ప్రకారం కొన్ని రాష్ట్రాల్లోని ప్రత్యేక వెసులుబాటు పొందుతున్నాయి. 10 గంటల వర్కింగ్ అవర్స్‌ను అమలు చేస్తున్నాయి. అవి అస్సాం (టీ ఎస్టేట్స్), తమిళనాడు (ప్లాంటేషన్స్, టెక్స్టైల్స్), కేరళ (ప్లాంటేషన్స్, కొన్ని ఇండస్ట్రీలు), కర్ణాటక (కాఫీ ఎస్టేట్స్, కొన్ని ఫ్యాక్టరీలు), మహారాష్ట్ర (కొన్ని ఫ్యాక్టరీలు, టెక్స్టైల్స్), పశ్చిమ బెంగాల్ (టీ ఎస్టేట్స్, కొన్ని ఫ్యాక్టరీలు) ఇప్పుడు ఈ జాబితాలోకి ఆంధ్రప్రదేశ్ కూడా చేరిపోయింది.