AP | తప్పుడు కేసులో వంశీ అరెస్ట్.. ప్రభుత్వంపై జగన్ గరంగరం

విజయవాడ, ఆంధ్రప్రభ: ఆఫీసర్లూ.. కూటమి ప్రభుత్వం అన్యాయంలో మీరు భాగం కావొద్దు. మీ టోపీపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయండి. అన్యాయం చేసిన అధికారులు, నేతల్ని బట్టలూడదీసి నిలబెడతాం. రిటైర్ అయినా.. సప్తసముద్రాల అవత‌ల ఉన్నా వదిలిపెట్టం. అన్యాయం చేసేవారిని చట్టం ముందు నిలబెడతాం. న్యాయం జరిగేలా చేస్తాం.. అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్వరంతో పోలీసులను హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం విజయవాడ జైలులోని రిమాండ్ ఖైదీగా ఉన్న‌ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు. జైలులో వంశీని పరామర్శించారు.

అక్ర‌మ కేసుల‌పై పోరాటం..

అక్రమ కేసులపై పోరాటం చేద్దామని, పార్టీ నేతల అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని వంశీకి జ‌గ‌న్ ధైర్యం చెప్పారు. జగన్ వెంట వైసీపీ తలశిల రఘురాం, వంశీ సతీమణి పంకజశ్రీ . సింహాద్రి రమేష్ ఉన్నారు. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్నినానికి విజయవాడ జిల్లా జైలులోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ములాఖత్‌లో వంశీని పరామర్శించేందుకు జగన్‌తో కలిసి కొడాలి నాని, పేర్ని నాని పేర్లను వైసీపీ నేతలు ఇచ్చారు. భద్రతా కారణాలతో వీరిద్దరికీ అనుమతి ఇవ్వలేమని జైలు అధికారులు స్పష్టం చేశారు. వంశీతో ములాఖత్ అనంతరం వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ.. వల్లభనేని వంశీ అరెస్టుతో రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్‌కు అద్దం పడుతోందన్నారు. కేవలం వంశీపై కక్షతో చంద్రబాబు చేస్తున్న కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసులో వంశీ పేరు లేదు..

పోలీసులు పెట్టిన కేసు ఏంటి?. టీడీపీ ఫిర్యాదులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీస్ లో పని చేసే సత్యవర్ధన్ చెప్పారు. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు, అయినా వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. వంశీని రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. మంగళగిరికి సత్యవర్ధన్ ను పిలిపించుకుని మరో ఫిర్యాదు చేయించారు. ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేశారు. కేసు మళ్లీ రీ ఓపెన్ చేశారు. సత్యవర్ధన్ నుంచి మరోసారి స్టేట్ మెంట్ తీసున్నారు. అందులోనూ వంశీ తప్పు లేదని చెప్పారు. దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయ తగలబెట్టే ప్రయత్నం చేశారని, ఆ కార్యాలయం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిందని వంశీపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారు. అని జగన్ ఆవేశం వ్యక్తం చేశారు.

వంశీపై కుట్రతోనే తప్పుడు కేసు

టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు.. ఆ కార్యాలయం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించింది. కాదు. వంశీపై చంద్రబాబు కక్ష గట్టి తప్పుడు కేసులు పెట్టించారు. వంశీకి బెయిల్ రాకూడదని చంద్రబాబు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారు. మరో నెలల తరబడి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. మరో 44 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టారు, అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యం ఖూనీ

రాష్ర్టంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని జగన్ విమర్శించారు. పిడుగరాళ్లలో వైస్ చైర్మన్ పదవి విషయంలో ఏం జరిగిందో చూశాం. 33 కార్పొరేటర్లు వైఎస్సార్సీపీనే గెలిచింది. వైఎస్ చైర్మన్ తామే గెలిచామని టీడీపీ ప్రకటించుంది. తునిలో కూడా 30కి 30 స్థానాలు వైసీపీ గెలిచింది. పాలకొండలోనూ ఇలానే చేస్తున్నారు. అంతటా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. పోలీసులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *