- ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు.
అమరావతి: రాష్ట్రంలో ఐటి, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC) విస్తరణకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉండవల్లి నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
లోకేష్ మాట్లాడుతూ, రాబోయే నాలుగేళ్లలో ఐటి, ఎలక్ట్రానిక్స్, డాటా సెంటర్లు, జిసిసీల ద్వారా కనీసం 10 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అధికార యంత్రాంగం సమన్వయపూర్వకంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
ఇప్పటివరకు రాష్ట్రానికి 95 ప్రముఖ సంస్థలు లక్షకోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని మంత్రి వెల్లడించారు. ఈ సంస్థలు తక్షణమే తమ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాలు త్వరితగతిన అందించాలన్నారు.
టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ ఐటి కంపెనీలు విశాఖపట్నంలో వీలైనంత త్వరగా కార్యకలాపాలను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్యతరహా సంస్థలకు సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో కో-వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేయాలని సూచించారు.
అదే సమయంలో, పౌరసేవల్లో విస్తృతంగా వినియోగంలో ఉన్న మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తరించి మరిన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలతో రాష్ట్రం ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగంలో ముందువరుసలో నిలుస్తుందని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.