AP | కాశ్మీర్ టూర్‌కు వెళ్లిన ఆరుగురు వైజాగ్ వాసులు మిస్సింగ్

  • ఆందోళనలో పాండురంగాపురం వాసులు

ఉగ్రదాడి జరిగిన పహల్‌గామ్‌ పరిసరాల్లో ఆంధ్రప్రదేశ్‌, విశాఖ వాసులు మిస్సయ్యారు. వేసవి సెలవులు కావడంతో ఇటీవలే విశాఖ, పాండురంగాపురానికి చెందిన మూడు కుటుంబాలు కశ్మీర్ టూర్‌కు వెళ్లాయి. ఇవాళ ఉగ్రదాడి అనంతరం రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళితో పాటు మరో రెండు జంటలు మిస్సయ్యాయి.

టీవీల్లో ఉగ్రదాడి వార్తలు చూసిన పాండురంగాపురం వాసులు, వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. వారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదని టెన్షన్ పడుతున్నారు. కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వేడుకుంటున్నారు.

కాగా, జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్‌గామ్‌లో పర్యటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 27 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదేనని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు.

కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకొని కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

Leave a Reply