AP | వ‌ల్ల‌భ‌నేని వంశీ ఫోన్ కోసం జల్లెడ ‍ ‍… హైదరాబాద్ లో సోదాలు

విజయవాడ, ఆంధ్రప్రభ : వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వినియోగించిన ఫోన్‌ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. హైద‌రాబాద్‌లో ఆయన్ను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులకు ఫోన్ దొరకలేదు. వంశీ వ్యక్తిగత సహాయకుడి ఫోన్‌మాత్రమే స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వంశీ ఫోన్‌ దొరికితే కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. వంశీ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరుతూ పోలీసులు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం అనుమతి రాగానే విజయవాడలోని వంశీ ఇళ్లల్లో సోదాలు నిర్వహించే అవకాశం ఉంది.


ఇది ఇలా ఉంటే . మరోవైపు ఈ కేసులో ఏపీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హైదరాబాద్ ‘మై హోం భుజా’లోని వంశీ నివాసంలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. దీని కోసం విజయవాడ నుంచి రెండు పోలీసు బృందాలు హైదరాబాద్ కు వెళ్లాయి. శనివారం హైదరాబాద్‌కు చేరుకున్న విజయవాడ పటమట పోలీసులు రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఫోన్ కోసం వెతికారు. దాదాపు 40 నిమిషాలు జల్లెడ పట్టారు. ఫోన్ లోకేషన్ తెలిసినా అది కనిపించ లేదు.

ఇక పోలీసుల దృష్టి మరల్చేందుకు వంశీ రెగ్యులర్‌ కాల్స్ కాకుండా వాట్సాప్‌ కాల్స్‌లోనే మాట్లాడుతుంటారని సమాచారం. ఈ నేపథ్యంలో ఫోన్‌లోని ఇంటర్ నెట్ ప్రొటోకాల్ డిటైల్ రికార్డు వివరాలు రాబడుతున్నారు. ఇప్పటికే వంశీ ఇంటి దగ్గర వారం రోజులుగా సీసీ పుటేజీని పోలీసులు సేకరించారు. ఇక కిడ్నాప్ ఉదంతంపై సత్యవర్థన్ నుంచి 164 నమోదు కోసం కోర్టు అనుమతిని కోరారు. ఇక జైలులో వంశీ పరిస్థితిపై అధికారులు గట్టి నిఘా పెట్టారు. జైలు చుట్టూ 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, జైలులో తన భర్తకు ప్రాణహాని ఉందని వంశీ సతీమణి పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీసు కస్టడీపై సోమవారం నిర్ణయం
వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీ కోరుతూ పటమట పోలీసులు విజయవాడ 4వ ఏసీఎంఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వంశీ ఫోన్ సీజ్ చేసేందుకు అనుమతినివ్వాలని పోలీసులు పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్‌గా పనిచేసిన సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీ ఏ1 నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అదే సమయంలో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీబాబు, గంటా వీర్రాజులను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీబాబు కారును సీజ్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పటివరకు ఐదుగురు అరెస్ట్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *