నారా లోకేష్‌కు నేతృత్వంలో హైపవర్ కమిటీ !
అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం భారీ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ లక్ష్యంతో విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో ‘పార్ట్నర్షిప్ సమ్మిట్’ (Vizag Partnership Summit 2025) నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సమ్మిట్‌కు ఆరుగురు మంత్రులతో కూడిన హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మంత్రివర్గంలోని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. కమిటీలో మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ సభ్యులుగా ఉండనున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మిట్ నిర్వహణకు సంబంధించి వేదిక ఏర్పాట్లు, వసతులు, పర్యాటక మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు మరో 9 వర్కింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.
ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించి, పారిశ్రామిక వృద్ధికి బలమైన వేదిక ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.