AP | టీచర్ల సీనియారిటీ జాబితా ప్ర‌క‌టిస్తాం … మంత్రి నారా లోకేష్

వారి బ‌దీల‌ల‌కు ప్ర‌త్యేక చ‌ట్టం చేస్తాం
టీచ‌ర్ల‌పై అధిక‌భారం మోపితే న‌ష్ట‌పోయేది విద్యార్ధులే
విద్యావ్య‌వ‌స్థ‌లో ఉపాధ్యాయుల పాత్రే కీల‌కం
మెగా డిఎస్సీపై టీచ‌ర్ల సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాం
శాస‌న‌స‌భ‌లో ప్ర‌క‌టించిన మంత్రి నారా లోకేష్

వెల‌గ‌పూడి , ఆంధ్ర‌ప్ర‌భ – డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తే చాలు కేసులు పడేవని, దీంతో ఆ నోటిఫికేషన్ ఎటూ తేలేది కాదని అన్నారు మంత్రి నారా లోకేష్ . ఈ క్రమంలో లోటుపాట్లను సరిచేసి, ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేకుండా త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శాస‌న‌స‌భ‌లో నేడు డిఎస్సీ నోటిఫికేషన్ పై మాట్లాడుతూ, ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి వివరించారు.

బదీల‌ల్లో పార‌ద‌ర్శ‌క‌త పాటిస్తాం

ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత ఉండేలా చర్యలు చేపడుతున్నామని లోకేశ్ వెల్లడించారు. టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. విద్యావ్యవస్థలో టీచర్లది ప్రధాన పాత్ర అని ప్రశంసలు కురిపించారు. వారిపై భారం మోపితే విద్యార్థులకు సరిగా పాఠాలు చెప్పలేరని అన్నారు.

ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై మంత్రి లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఐబీ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని ప్రగల్బాలు పలికిందని గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించి నివేదిక కోసమే రూ.5 కోట్లు ఖర్చుచేసిందని ఫైర్ అయ్యారు. ఇక ఉపాధ్యాయుల అభ్యంత‌రాల మేర‌కు జీవో నెం.117ను రద్దు చేసి ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.

క‌ర్నూలు జిల్లాల‌లో వ‌ల‌స‌లు రూపుమాపుతాం …

యువగళం పాదయాత్ర ఆలూరు, ఆదోనిలో కొనసాగుతున్న సమయంలో కుటుంబాలు మూకుమ్మడిగా వలసలు వెళ్లడం చూశానని, అవన్నీ చూశాకే ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు, తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చానని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఒకే వాహనంపై 200 మంది వెళ్లడం కూడా గమనించానని ఆయన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సాగు, తాగునీరు ఇచ్చే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, నంద్యాల తర్వాత కర్నూలులో పాదయాత్ర చేశానని, ఈ రెండు ప్రాంతాల మధ్య ఎంతో వ్యత్యాసం కనిపించిందని అన్నారు. కర్నూలు జిల్లాలో శివారు ప్రాంతాలకు కూడా సాగు, తాగునీరు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో రెండుసార్లు చర్చించినట్లు అసెంబ్లీ వేదికగా చెప్పారు. స్థూల నమోదు నిష్పత్తి, అక్షరాస్యతలో కర్నూలు వెనుకబడి ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవమని ఆయన అన్నారు. అందుకే రాబోయే డీఎస్సీలో కర్నూలుకు ఎక్కువమంది ఉపాధ్యాయులు రాబోతున్నారని తెలిపారు.

విద్యార్థులకు అపార్ ఐడి తప్పనిసరి

విద్యార్థులకు అపార్ ఐడిని కేంద్రం తప్పనిసరి చేస్తోందన్నారు. కేజీ నుండి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తామని వెల్లడించారు. ఇందుకు అవసరమైన ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను తయారు చేస్తున్నామని తెలిపారు. ఒక్క డ్రాపవుట్ ఉండకూడదనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సీజనల్ హాస్టల్స్‌కు సంబంధించి కేవలం భోజనం పెట్టడానికి మాత్రమే అవకాశం ఉందన్నారు. కరువు ప్రాంతాల్లోని ప్రజలు వేరేచోటకు వలసలు వెళ్లిన సమయంలో అక్కడ అడ్మిషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

హ‌స్ట‌ళ్ల తీరును మెరుగుప‌రుస్తాం …

హాస్టళ్ల పనితీరు, విద్యార్థుల ట్రాకింగ్ ఉంటేనే డ్రాపవుట్స్ తగ్గుతాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో 2024-25లో 121 సీజనల్ హాస్టళ్లు ఉండగా, వాటిలో 6,040 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించినట్లు చెప్పారు. ఇందుకోసం రూ.6.04 కోట్లు ఖర్చు పెడుతున్నామని ఆయన అన్నారు. సీజనల్ హాస్టళ్ల నిర్వహణ ఇప్పటివరకు ప్రణాళికాబద్ధంగా లేదని అన్నారు.
పిల్లలకు మెరుగైన విద్య అందించాలన్నదే తమ లక్ష్యమని నారా లోకేశ్ అన్నారు. పిల్లల వలసల నివారణకు గత ప్రభుత్వం పని చేయలేదని విమర్శించారు. సీజనల్ హాస్టళ్ల పనితీరు మెరుగుదలకు అసెంబ్లీ అయ్యాక శాసనసభ్యులతో చర్చిస్తామని అన్నారు. హాస్టళ్ల పనితీరు మెరుగు, పాఠశాలల్లో చేరేవారి నిష్పత్తి, విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి పెరుగుదలకు వచ్చే మూడేళ్లు కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.
బీసీ, ఎస్సీ హాస్టళ్లను కన్వర్జెన్స్ చేసి సీజనల్ హాస్టళ్ల పనితీరు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. రాబోయే మూడేళ్లలో హాస్టళ్ల పనితీరులో మార్పు తెస్తామన్నారు. సీజనల్ హాస్టళ్లకు సంబంధించి పలు పత్రికల్లో ఆర్టికల్స్ వచ్చాయని, ఏ మీడియాలో వచ్చినా సీరియస్‌గా తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే రెండు, మూడు నెలల్లో సీజనల్ హాస్టళ్ల పనితీరులో మార్పును మీరే గమనిస్తారని మంత్రి లోకేశ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *