ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో )ప్రజాసేవలో ప్రతినిత్యం తలమునకలయ్యే ప్రజాప్రతినిధులకు ఉపశమనం కలిగించేదిశగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల క్రీడలను సమర్థవంతంగా నిర్వహించేందుకు శాప్ ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేసినట్లు శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు.
క్రీడలకు సంబంధించి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను, పలు క్రీడా కోర్టులను ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బొజ్జల సుధీర్ రెడ్డి, సుందరపు విజయ్‌కుమార్, పీవీజీఆర్ నాయుడు(గణబాబు), ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పంచుమర్తి అనురాధతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు.
క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, త్రోబాల్, థగ్ ఆఫ్ వార్, తదితర కోర్టులను పరిశీలించి ట్రయల్ గేమ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, క్రీడాశాఖామంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు క్రీడలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. దానిలో భాగంగానే కమిటీ సభ్యులంతా గత పదిరోజులుగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధుల క్రీడా సంబరాల్లో 13 క్రీడలను నిర్వహించనున్నామని, మంగళవారం మధ్యాహ్నం క్రీడాశాఖామంత్రి, స్పీకర్ కలిసి క్రీడలను ప్రారంభిస్తారన్నారు.
20వ తేదీన క్రీడలు ముసిగిన తర్వాత గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ ప్రజాప్రతినిధులను సైతం క్రీడల్లో భాగస్వాములను చేస్తుందన్నారు. తద్వారా వారి నియోజకవర్గాల్లోనూ క్రీడలను అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా శాసనసభ్యుల క్రీడలతో ఐజీఎంసీ స్టేడియం అభివృద్ధికి నోచుకోవడం సంతోషకరమన్నారు. ..
.క్రీడల నిర్వహణపై సమీక్ష….
మూడురోజులపాటు జరిగే ప్రజాప్రతినిధుల క్రీడలను ఆయా స్టేడియాల్లో ప్రాధాన్యతాక్రమంలో నిర్వహించనున్నట్లు క్రీడల కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివరించారు. క్రీడల నిర్వహణకు సంబంధించి శాప్ కోచ్‌లు, డీఎస్డీఓలతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఒక్కో డీఎస్డీఓకు ఒక్కో క్రీడను కేటాయించారు. వారికి కేటాయించిన క్రీడలకు సంబంధించి జట్టులను, మ్యాచులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
తొలుత థగ్ ఆఫ్ వార్, క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, టెన్నిస్, కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, రన్నింగ్, టెన్నికాయిట్ క్రీడలను నిర్వహిస్తామని వెల్లడించారు. క్రీడల్లో పాల్గొనే ప్రజాప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వసతులు సమకూర్చాలని విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే గణబాబు సూచించారు.
అలాగే స్టేడియానికి వచ్చే ప్రజాప్రతినిధులు, న్యాయనిర్ణేతలు, శాప్, మున్సిపల్ అధికారులు ఇబ్బందిపడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతోపాటు ప్రతీచోట సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ అనురాధ తెలియజేశారు.
క్రీడాసామగ్రి పంపిణీ, రిసెప్షన్, శానిటేషన్ విభాగాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గణబాబు, సుధీర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌లు సూచించారు. ప్రతీ విభాగానికి ఒక్కో ఇంఛార్జ్ ఉండాలని, దానికారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ ఏఓ ఆర్.వెంకటరమణ నాయక్, డీఎస్డీఓలు, శాప్ కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.