కర్నూలు బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల పనులు చురుగ్గా కొనసాగించాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులపై ఆయన చర్చించారు.
పెండింగ్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని కోరినట్లు మంత్రి తెలిపారు. రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించినట్లు టి.జి భరత్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని ఇరువురి మధ్య చర్చ వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎన్నో ఏళ్ల నుండి ఉన్న అనుబంధాన్ని కేంద్ర మంత్రి గుర్తుచేశారని చెప్పారు.
ఇక ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులపై పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటానని రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చినట్లు మంత్రి టి.జి భరత్ తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి అధికారులతో సమీక్షిస్తానని రాజ్ నాథ్ సింగ్ చెప్పారన్నారు. ఏపీలో ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని టి.జి భరత్ అన్నారు.
పెట్టుబడిదారులతో నిత్యం సమీక్షిస్తూ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయడంతో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు.
కర్నూలు – విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించండి
కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి కర్నూలు – విజయవాడ విమాన సౌకర్యంపై చర్చించినట్లు పేర్కొన్నారు.
ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని కేంద్ర మంత్రి తెలిపినట్లు టి.జి భరత్ చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించి అడుగులు పడే అవకాశం ఉందని చెప్పారన్నారు. కర్నూలు – విజయవాడ విమాన సౌకర్యం కల్పించేందుకు కేంద్ర మంత్రి ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇక్కడ అన్ని రకాల పరిశ్రమలు పెట్టేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలిపారు. విమాన సర్వీసు కూడా అందుబాటులోకి వస్తే పారిశ్రామికవేత్తల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.