- ఆస్తుల జప్తునకు కోర్టు ఆదేశాలు
విజయవాడ : సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ ఏసీబీ కోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేస్తూ, నిందితులకు చెందిన ఆస్తుల జప్తునకు అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం కొనసాగుతున్న దర్యాప్తులో ఒక ప్రధాన మలుపుగా మారింది.
ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఈ కేసులో నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతి కోరుతూ ఎసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న కోర్టు, సిట్ అభ్యర్థనను ఆమోదిస్తూ సుమారు రూ.32 కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు అనుమతి ఇచ్చింది. ఆస్తుల జప్తు ప్రక్రియలో సరైన విధానాన్ని నిర్ధారించడానికి, ఆగస్టు 1వ తేదీ నాటికి ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది.
చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఊరట
మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించిందని, బుధవారం (జూలై 16) వరకు ఆయనపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇక, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.