AP l వెలంపల్లికి వన్‌టౌన్ పోలీసుల ముందస్తు నోటీసులు..

AP l వెలంపల్లికి వన్‌టౌన్ పోలీసుల ముందస్తు నోటీసులు..

ర్యాలీలకు అనుమతి లేదంటూ స్పష్టం..
ప్రతిపక్ష గొంతు నొక్కుతున్న కూటమి ప్రభుత్వమని వైసీపీ ఆరోపణ..

AP, భవానిపురం, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేడు ఇబ్రహీంపట్నానికి రానున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పై పోలీసుల ఆంక్షలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. జగన్ రాకకు ముందు నుంచే వన్‌టౌన్ పోలీసులు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు ముందస్తు నోటీసులు జారీ చేసి, ఎటువంటి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో ప్రజా భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులను కారణంగా చూపుతూ, ఎలాంటి సమావేశాలు, రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించవద్దని సూచించినట్లు తెలిసింది. దీని పై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష గొంతును నొక్కేందుకు కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటోంది అంటూ వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.

జోగి రమేష్ నివాసంపై ఇటీవల జరిగిన దాడి నేపథ్యంలో, సంఘీభావంగా ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ స్వయంగా ఇబ్రహీంపట్నానికి వెళ్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కూడా జగన్‌తో పాటు సంఘీభావంగా వెళ్లనున్నారు. అయితే జగన్ పర్యటనకు సంబంధించి అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముందస్తు నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు పోలీసులు మాత్రం ఇది పూర్తిగా భద్రత, ట్రాఫిక్ నిర్వహణ కోసమే తీసుకున్న చర్యలని చెబుతున్నారు.

నగరంలో ఇప్పటికే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో, భారీగా జనాలు రోడ్లపైకి వస్తే అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశముందని, అందుకే ముందస్తుగా నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వివరణ ఇస్తున్నారు. ఈ వివరణలను వైసీపీ శ్రేణులు తిరస్కరిస్తున్నాయి. అధికార పార్టీ నేతల పర్యటనలకు ఎలాంటి ఆంక్షలు లేని పరిస్థితుల్లో, ప్రతిపక్ష నేత జగన్ పర్యటనకు మాత్రం ప్రత్యేక నిబంధనలు విధించడం రాజకీయ వివక్షకు నిదర్శనమని ఆరోపిస్తున్నారు. ప్రజలతో కలిసే హక్కును కూడా హరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అంటూ పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

Leave a Reply