ఏడు కొండలు ఎక్కి
రెండు కిలోమీటర్లు నడిచి..
25 మంది వైద్యబృందం సాహస యాత్ర
కొండరెడ్లు ఖుషీఖుషీ
ఆరు జంటల పెళ్లి వేడుకల్లో వైద్యులు సంబురం
బియ్యం, దుప్పట్లు, దుస్తుల పంపిణీ
చింతూరు/మోతుగూడెం (ఏఎస్ఆర్ జిల్లా), (ఆంధ్రప్రభ): చింతూరు (chintoor ) అనగానే ముందుగా గుర్తోచ్చేది ఏజెన్సీ.. ఆ ఏజెన్సీలోని (Agency )మారుమూల ఏడు గుట్టలు దాటిన తరువాత వచ్చేదే ఏరువాడ గ్రామం. ఈ గ్రామంలో మొత్తం కొండరెడ్డులే (Kondareddy ) జీవనం సాగిస్తుంటారు. అంకిత భావంతో పని చేసే అధికారులు, ఉద్యోగులు మాత్రమే రెండు మూడేళ్ల కోసారి ఈ కుగ్రామాన్ని సందర్శిస్తారు. చింతూరు గత ఐటీడీఏ (ITDA ) పీవో ఆకుల వెంకట రమణ ”కొండబాట పేరుతో” 2020 ఫిబ్రవరి 15 వ తేదిన ఏరువాడ గ్రామానికి అధికార యంత్రాంగం మొత్తాన్నిఏడు కొండలు ఎక్కించి అక్కడ ఉన్న కొండరెడ్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన తరువాత మరే అధికారి ఈ 5 సంవత్సరాల వ్యవధిలో ఏరువాడ గ్రామాన్ని సందర్శించిన దఖాలాలు లేవు. తులసిపాక పీహెచ్సీ వైద్యబృందం ఇప్పుడూ ఆ గ్రామానికి వెళ్లి వైద్య చికిత్సలు అందించి వచ్చింది.
ఏరువాడలో వైద్య శిబిరం
మన్యంలోని చింతూరు మండలం చదలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏరువాడ గ్రామంలో తులసిపాక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 25 మంది వైద్య సిబ్బంది దట్టమైన అటవీప్రాంతం గుండా కాలినడకన సుమారు 2 కిలో మీటర్ల సాహసయాత్ర చేశారు. అరణ్యంలోని పెద్ద పెద్ద గుట్టలు, కొండలు ఎక్కుతూ అష్టకష్టాలు పడి ఏరువాడ గ్రామానికి చేరుకొని వైద్య శిబిరం నిర్వహించారు. ఆ గ్రామస్తులకు వైద్య సేవలు అందించారు. ఈ వైద్య సేవల్లో ముఖ్యంగా జ్వరం, మలేరియా జ్వరాలకు పరీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలిక, అంటు వ్యాధులను ముందస్తుగా గుర్తించడానికి సర్వేలు చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, విద్య ప్రాముఖ్యతపై పిల్లలకు, అన్ని వయసుల వారికి ఆరోగ్య అవగాహన కల్పించారు. ప్రతి గుడిసెలల్లో దోమల నియంత్రణ కోసం ఇండోర్ అవశేష స్పేయ్రింగ్ చేపట్టారు.
ఆరు జంటల పెళ్లి వేడుక

తులసిపాక వైద్య బృందం వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి వెళ్లిన రోజే ఆ గ్రామంలో ఒకే రోజు 6 జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి. ఈ వివాహ వేడుకలకు వైద్య బృందాన్ని అతిథులుగా కొండరెడ్లు ఆహ్వానించి పండుగ ఉత్సాహాల మధ్య వైద్యబృందంపై పూల దండలు, జానపద పాటలు స్వాగతం పలికారు. ఈ అనుభవాలతో వైద్యబృందం పరవశించారు. ఏరువాడ గ్రామ పర్యటనకు వెళ్లిన తులసిపాక పీహెచ్సీ వైద్య బృందం తీసుకెళ్లిన బియ్యం బస్తాలతో పాటు దాతలు ఇచ్చినటువంటి దుస్తులు, దుప్పట్లు 25 కుటుంబాలకు చెందిన 100 మంది కొండరెడ్లకు పంపిణీ చేశారు.