*కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ గా దిల్షాద్ దున్నిషా
*వైస్ చైర్మన్ లుగా సుధారాణి, రాజశేఖరాచారి.
*ఏకిగ్రీవంగా ఎన్నికైన చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లు
*ఎన్నికను బహిష్కరించిన వైసిపి
శ్రీ సత్యసాయి బ్యూరో (ఆంధ్రప్రభ):శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని టిడిపి కైవసం చేసుకుంది. చైర్ పర్సన్ గా పదవ వార్డు కౌన్సిలర్ కేఎస్ దిల్షాదున్నీషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే సందర్భంలో వైస్ చైర్ పర్సన్ లుగా సుధారాణి, రాజశేఖర్ ఆచారి లు ఎన్నికయ్యారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్లో టిడిపి రెండోసారి చైర్పర్సన్ పదవిని కైవసం చేసుకున్నది.గతంలో 2014లో సైతం టిడిపి తరఫున సురియా భాను మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన విషయం తెలిసిందే.
గత రెండు, మూడు నెలలుగా కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ పదవిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కౌన్సిల్లో మెజార్టీగా ఉన్న వైకాపా కౌన్సిలర్లు 2024 సాధారణ ఎన్నికల ముందు,అనంతరం తలెత్తిన వైకాపా విభేదాల కారణంగా పలువురు వైకాపా కౌన్సిలర్లు టిడిపిలో చేరుకోవడం, వైకాపా చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం కు మద్దతు తెలపడం పదవి నుంచి తొలగించడం వంటి సంఘటనలు చోటు చేసుకోవడం తెలిసిందే.
తాజాగా నూతన చైర్ పర్సన్ ఎన్నికకు కలెక్టర్ టీఎస్ చేతన్ 19వ తేదీ సమావేశం ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడంతో గత వారం, పది రోజులుగా తీవ్ర ఉత్కంఠ కు తెరలేపింది. అయితే స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఉత్కంఠకు తెర దించుతూ పదవ వార్డ్ కౌన్సిలర్ కేఎస్ దిల్షాదున్నీషాను చైర్పర్సన్ గాను, సుధారాణి, రాజశేఖర్ ఆచారిలను వైస్ చైర్మన్ గా ఎంపిక చేసారు. ఇదిలా ఉండగా వైకాపా కౌన్సిలర్లు 11 మంది చైర్పర్సన్ ఎన్నిక బహిష్కరిస్తూ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆర్డిఓ ఎస్ఎస్ శర్మ, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించారు.