నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో ఇటీవల కాలంలో కుక్కల దాడులు ఎక్కువ అయ్యాయి. కుక్కల దాడుల వల్ల చిన్నారుల ప్రాణాలు హరిస్తున్నాయి. గత రెండు నెలల క్రితం జిల్లాలోని బేతంచెర్ల ప్రాంతంలో రెండేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసి న ఘటనలో ఆ చిన్నారి మరణించాడు. గురువారం రాత్రి నంద్యాల జిల్లాలోని బనగానపల్లె మండలం కైప గ్రామంలో ఓ చిన్నారి బాలికపై కుక్కలు దాడి చేశాయి.
గ్రామానికి చెందిన మధుప్రియ అనే నాలుగేళ్ల బాలికపై వీధి కుక్కలు గుంపులుగా వచ్చి ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేశాయి. గ్రామంలో తోటి స్నేహితులతో ఆడుకుని ఇంటికి వస్తుండగా కుక్కల గుంపు ఒక్కసారిగా మధుప్రియ పై దాడి చేశాయి.చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే ఆ ఆ చిన్నారి స్వృహ కోల్పోయింది.
అత్యవసరంగా బనగానపల్లె ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి ఆధునిక వైద్య చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం నాలుగేళ్ల మధుప్రియ మరణించింది. గ్రామంలో విషాదం నెలకొంది. ఇలా కుక్కల దాడిలో చిన్నారుల మరణం పై జిల్లా అధికారులు స్పందించకపోవడం విశేషం. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని కుక్కల దాడి నుంచి చిన్నారులను కాపాడాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు..